
కుటుంబసభ్యులతో ఎస్.భరత్ నాయక్
అనంతపురం, ఎస్కేయూ :తల్లి జిల్లా ఖజానా అధికారి , తండ్రి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సెరికల్చర్ విభాగంలో ప్రొఫెసర్. ఒకరిది బోధన, పరిశోధన రంగం.. మరొకరిది ఆర్థిక పరిపాలన రంగం. ఉన్నత విద్యావంతులైన వారినే స్ఫూర్తిగా తీసుకున్నాడు వారి కుమారుడు. వారు అందించిన ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యాడు. అకుంఠిత దీక్షతో సాగిన ఈ మహాయజ్ఞంలో గ్రూప్–1 విజేతగా నిలిచాడు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కేడర్‌లో ఉద్యోగానికి అర్హత సాధించిన అతనే.. అనంతపురానికి చెందిన ఎస్.భరత్ నాయక్. గ్రూప్–1 ఫలితాలు మార్చిలో వచ్చినప్పటికీ..., ఇటీవల ఫిజికల్ టెస్ట్.. ఫిటెనెస్ పరీక్షల్లో నెగ్గారు. దీంతో పోస్టు ఖాయమైంది.
ఎంబీబీఎస్ నుంచి...
అనంతపురంలోని శారదనగర్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్ .శంకర్‌నాయక్... శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెరికల్చర్ విభాగాధిపతి. తల్లి శాంతాబాయి.. అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా ఖజానా అధికారిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు భరత్ నాయక్. పదో తరగతి వరకు స్థానిక ఎల్‌ఆర్‌జీ స్కూల్‌లో చదువుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఎంసెట్‌లో గణనీయమైన ర్యాంక్ సాధించి, అనంత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సివిల్స్ సాధనే లక్ష్యంగా ఎంచుకున్న అతను.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌లో చేరారు.
తొలి విడతలోనే..
డాక్టర్‌గా ప్రొఫెషనల్ కెరీర్ ఉన్నప్పటికీ, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ సాధనే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్న తరుణంలోనే 2016లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడింది. దానిని చూసిన భరత్‌నాయక్.. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దరఖాస్తు చేసుకున్నారు. 2017లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఇంటర్వ్యూల్లో నెగ్గారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
కఠోర శ్రమతో...
ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు చేరిన భరత్ నాయక్.. శిక్షణ తరగతులతో కలిపి రోజూ దాదాపు పది గంటల పాటు ప్రశ్న పత్రాలపై సాధన చేసేవారు. ఎలాంటి పరిస్థిల్లోనూ ఒత్తిళ్లకు లోను కాకుండా లక్ష్య సాధనలో శ్రమించారు. నిత్యమూ వార్త పత్రికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. సిలబస్ అనుగుణంగా సన్నద్ధమయ్యారు.
సివిల్స్‌పైనే దృష్టి
ఎంబీబీఎస్ చేస్తున్నపుడే సివిల్స్, గ్రూప్స్ పరీక్షలపై అవగాహన పొందుతూ వచ్చాను. ఎంబీబీఎస్ తర్వాత శిక్షణ ప్రారంభించాను. తల్లిదండ్రుల అంగీకారంతో పట్టుదలతో చదివి ఈ స్థానానికి చేరుకున్నాను. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా, ప్రయత్నిస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు సాధించడమే నా ముందున్న లక్ష్యం. సివిల్స్ సాధించితీరుతా. తమ్ముడు భార్గవ్‌నాయక్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చేస్తున్నాడు. గ్రూప్–1లో మేథమేటిక్స్ పేపరు క్లిష్టంగా ఉండటంతో రెండు నెలల పాటు తమ్ముడి వద్ద ప్రత్యేక శిక్షణ పొందాను. సాక్షిలో రోజూ వచ్చే భవిత మెటీరియల్ దోహదపడింది. సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఉన్న స్టడీ మెటీరియల్ సైతం బాగా ఉపయోగపడింది. ఇతరులతో మనం ఎపుడూ పోల్చుకోకూడదు. ఇంటర్వ్యూలో భారత్–చైనా– అమెరికా సంబంధాల గురించి అడిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పురోగతి గురించి వివరించమన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో సివిల్స్ సర్వీసెస్‌కు సంబంధించిన మెటీరియల్ దోహదపడింది.– ఎస్.భరత్ నాయక్, గ్రూప్–1 విజేత
Comments
Please login to add a commentAdd a comment