'భీమవరమే హీరోను చేసింది'
భీమవరం : భీమవరంలో చూసిన సినిమాలే తాను హీరో అవ్వడానికి కారణమని హీరో సునీల్ అన్నారు. ‘భీమవరం బుల్లోడు’ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా మంగళవారం యూనిట్ ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులో సందడి చేసింది. భీమవరంలో విజయలక్ష్మి థియేటర్‌లో హీరో సునీల్ మాట్లాడుతూ ‘వర్షంలోని పిడుగు భీమవరం బుల్లోడి అడుగు’ అంటూ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ చిత్ర విజయానికి కారణం ప్రేక్షకులే అని అన్నారు.
ముందుగా ఓ రెస్టారెంట్‌లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తనను 20 ఏళ్లపాటు మోసిన భీమవరానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఇక్కడ నిర్వహించిన ఆడియో ఫంక్షన్‌కి వచ్చిన స్పందనే సినిమా విజయానికి కారణమని చెప్పారు. రాబోయే రోజుల్లో ఓ సంస్థను ఏర్పాటుచేసి పట్టణాభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని చెప్పారు. భీమవరం బుల్లోడు చిత్రానికి వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్‌లు గతంలో తన ఏ చిత్రానికి రాలేదని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు.
సునీల్ కోరిక మేరకే టైటిల్
హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ భీమవరం పట్టణం అందమైన పేయింటింగ్‌లా ఉందన్నారు. ఆడియో ఫంక్షన్‌లో భీమవరం అంటే ఏమిటో చూశానని మళ్లీ ఇప్పుడు మరోసారి రుజువైందని చెప్పారు. చిత్రం డెరైక్టర్ ఉదయ శంకర్ మాట్లాడుతూ భీమవరం బుల్లోడు అనే టైటిల్‌ను సునిల్ కోరిక మేరకే పెట్టామన్నారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. నటుడు పృధ్వీరాజ్, రచయిత శ్రీధర్, పి.రామకృష్ణ, సంతోష్‌వర్మ, శ్రీను, మురళీ పాల్గొన్నారు.