ఆనందపురం (విశాఖ జిల్లా): ఆనందపురం మండలంలోని భీమిలి క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమంది గాయపడ్డారు.
ఆనందపురం (విశాఖ జిల్లా): ఆనందపురం మండలంలోని భీమిలి క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమంది గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులందరూ శ్రీకాకుళం జిల్లావారు. గార మండలం వత్సవలస పంచాయతీ మోగదలపాడు గ్రామానికి చెందిన పలువురు ముంబాయిలో నేవీ మర్చంట్‌లోను, ఇతర ప్రాంతాలలోను పనిచేస్తున్నారు. వారు ఇటీవల స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు గురువారం ఉదయం స్కార్పియో వాహనంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. వారితోపాటు ముంబాయి బయలుదేరిన మోగడాలపాడు ఎంపీటీసీ సభ్యుడు చీగటి చిన్నారావు కూడా వాహనంలో ఉన్నారు.
స్కార్పియో ఆనందపురం మండలం భీమిలి క్రాస్ రోడ్డు వద్దకు చేరుకునేసరికి... విశాఖ నుంచి వస్తున్న లారీ భీమిలి వైపు వెళ్లడానికి మలుపు తిరుగుతూ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఎంపీటీసీ సభ్యుడు చిన్నారావు తీవ్రంగా గాయపడగా పప్పు యల్లారావు చేయి విరిగింది. వాహనాన్ని నడుపుతున్న బడగల మధుబాబుతోపాటు అందులో ప్రయాణిస్తున్న పప్పు పోతురాజు, పప్పురాజు, పప్పు దుర్గారావు, పప్పు ఎల్లయ్య, పప్పు ఎల్లారావు, కొమర లక్ష్మణ, జి.కృష్ణారావు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో స్కార్పియో నుజ్జునుజ్జయింది. కేసును ట్రాఫిక్ ఎస్‌ఐ కె.సూర్యారావు దర్యాప్తు చేస్తున్నారు.