సోనియా డెరైక్షన్‌లోనే బాబు, కిరణ్
సోనియా డెరైక్షన్‌లోనే బాబు, కిరణ్
Published Sat, Aug 10 2013 3:16 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శకత్వంలోనే ముఖ్యమంత్రి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. బ్రిటిష్ పాలకుల మాదిరిగా విభజించు, పాలించు చందంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీడీపీలను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టే రోజు అతి దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం వెలువడగానే ప్రతిపక్షనేత చంద్రబాబు స్వాగతిస్తారు. రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు కావాలంటారు. సీఎం కిరణ్ తీరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత బయటకువచ్చి ప్రతిపక్షనేతలా మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా లేవనెత్తిన అంశాలన్నీ సీడబ్ల్యూసీ ముందు ఎందుకు చెప్పలేదు? రాష్ట్రాన్ని ముక్కలు చేసేది కాంగ్రెస్ పార్టీనే... దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసేదీ ఆ పార్టీనేతలే... ఉద్యమాల్లో పాల్గొనేదీ వారే. ఎందుకీ డ్రామాలు?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే సోనియా దర్శకత్వంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
వైఎస్‌పై అభాండాలు అన్యాయం...
రాష్ట్ర విభజనకు బీజం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వేశారని, అందుకే నిర్ణయం జరిగిందంటూ కిరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవర్ని మభ్యపెట్టడానికని శోభ సూటిగా ప్రశ్నించారు. విభజనకు రాజశేఖరరెడ్డే బీజం వేసుంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు అమలు జరగలేదని ప్రశ్నించారు. మహానేత మరణించిన వంద రోజుల్లోనే లేఖ పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? అని నిలదీశారు. ‘‘2000 సంవత్సరంలో సీఎల్పీ లీడర్‌గా రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు వెళ్లి సోనియాగాంధీకి లేఖ ఇచ్చారని కిరణ్ చెబుతున్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా మీరు కూడా ఉన్నారు కదా! ఆ రోజు అదే జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ప్రతీదానికి ఉచిత విద్యుత్‌కు, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ పథకాలకు నేనే సలహాలు ఇచ్చానంటూ చెబుతున్నావు... విభజన విషయానికొచ్చేసరికి బీజం వేసింది వైఎస్ అంటూ ఆయనపై నిందలు వేస్తారా? మీరు చేస్తున్న డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు... మీకు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారు’’ అని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి దగ్గరుండే ఎమ్మెల్యేల చేత సోనియాగాంధీకి లెటర్ ఇప్పించినట్లయితే, ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో మీడియా సంస్థలున్నా... పత్రికల్లో కథనాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చిన్నారెడ్డి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి లేఖ ఇచ్చేటప్పుడు పార్టీ అధ్యక్షురాలు రాష్ట్రానికి వచ్చారనే రాజశేఖరరెడ్డితోపాటు మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, అప్పటి పీసీసీ చీఫ్ ఎం.సత్యనారాయణ అక్కడికి వెళ్లినట్లు ఆమె వివరించారు.
మాకున్న దూరదృష్టి మీకేదీ?
రాష్ట్ర విభజన జరిగితే నీటి పంపకాలు, రాజధాని, ఉద్యోగులు తదితర అంశాలలో తలెత్తే అంశాలను వివరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెలరోజులకిందటే కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు లేఖ రాస్తే, అధికార యంత్రాంగం చేతిలో పెట్టుకొని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోయారని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. కిరణ్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, నిర్ణయం వెలువడిన తర్వాత తొమ్మిది రోజులకు తీరిగ్గా బయటకొచ్చి ఇతరులపై బురద చల్లుతూ అభాండాలు వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకున్న ఆలోచన, దూరదృష్టి అధికారంలో ఉన్న పార్టీకి లేదా? కిరణ్ కళ్లు మూసుకొని పరిపాలన చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
సీమాంధ్రలో ఉద్యమం ఉధృతమైన తొమ్మిది రోజులకు మీడియా ముందుకొచ్చి సీఎం చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఒక సామాన్య వ్యక్తిని తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానంటూ హైకమాండ్‌కు చెప్పి, తానేదో గొప్పగా బ్యాటింగ్ చేశానంటూ మీడియాకు లీకులిచ్చి, ఇప్పుడు సిగ్గులేకుండా దివాలాకోరు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్‌మ్యాప్‌లతో పలు కోర్‌కమిటీలలో పాల్గొన్న మీకు ఏ విషయం చెప్పకుండానే సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారా? అనేది సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ను సంప్రదించిన వ్యక్తులు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మీకు చెప్పకుండానే జరిగిందా? అని ప్రశ్నించారు. మీ అనుమతి లేకుండానే నిర్ణయం జరిగినట్లయితే గౌరవం లేని పార్టీలో ఎందుకున్నారని నిలదీశారు. వెంటనే రాజీనామా చేసి బయటకు రాకుండా ఎవర్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని శోభ మండిపడ్డారు.
Advertisement
Advertisement