జిల్లాలో భారీగా భూసేకరణ చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జిల్లాలో నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న వివిధ ప్రైవేటు కంపెనీల కోసం భూమిని....
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో భారీగా భూసేకరణ చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జిల్లాలో నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న వివిధ ప్రైవేటు కంపెనీల కోసం భూమిని కేటాయించేందుకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు అవసరమయ్యే భూమి కోసం ఏకంగా 28 వేల ఎకరాలకుపైగా సేకరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది.
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా భారీ భూ బ్యాంకును సిద్ధంగా ఉంచాలనేది జిల్లా యంత్రాంగం ఆలోచనగా ఉంది. ఇందుకోసం సుమారు 40 వేల ఎకరాలను సేకరించి సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 12 వేల ఎకరాల మేరకు సేకరించి సిద్ధం చేసింది. మిగిలిన 28 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించేందుకు ఈ నెలాఖరులోగా అన్ని భూసేకరణ నోటిఫికేషన్లను జారీచేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశించినట్టు తెలిసింది.
ఆ మూడు మండలాల్లోనే!
జిల్లాలో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీల కోసం జిల్లావ్యాప్తంగా 28,236 ఎకరాల మేరకు భూమిని ఇంకా సేకరించాల్సి ఉందని ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. అయితే, ఇందులో ప్రధానంగా ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల్లోనే అధిక భూమిని సేకరించాల్సి ఉండటం గమనార్హం. ఫ్రధానంగా అటు ప్రాంతీయ విమానాశ్రయంతో పాటు సౌర విద్యుత్ పార్కు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ యూనిట్, వివిధ సిమెంటు ప్లాంట్ల కోసం ఈ భూమిని సేకరించాల్సి ఉంది.
మొత్తం 40 వేల ఎకరాల భూ బ్యాంకును ఏర్పాటు చేయడంలో ఈ భూసేకరణ ప్రక్రియ కీలకంగా మారనుంది. ప్రధానమైన పరిశ్రమలన్నీ కేవలం ఈ మూడు మండలాల్లోనే ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. వీటితో పాటు కొలిమిగుండ్ల, జూపాడుబంగ్లా, వెల్దుర్తి తదితర మండలాల్లో కూడా వివిధ యూనిట్ల కోసం భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం మీద 28 వేల ఎకరాలకుపైగా భూ సేకరణ ప్రక్రియను జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. అయితే, ఈ ప్రక్రియకు ఈ భూముల్లో ఉన్న రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం జిల్లా యంత్రాంగాన్ని కలవరానికి గురిచేస్తోంది.
మా భూములు ఇవ్వం...!
భారీ భూ సేకరణ ప్రక్రియకు ఒకవైపు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్ల జారీకి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే, భూసేకరణకు రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. తమ భూములు ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు పాణ్యంతో పాటు ఇటు ఓర్వకల్లు, గడివేముల మండలాల్లోని పలు గ్రామాల రైతులు కర్నూలు, నంద్యాల ఆర్డీవో కార్యాలయాల ముం దు ఆందోళనకు కూడా దిగుతున్నారు. ఒకవైపు భూములు ఇవ్వాల్సిందేనని రెవెన్యూ యంత్రాం గం.. ఇవ్వబోమని రైతుల ఆందోళనల నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యమాలు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లావ్యాప్తంగా భూ సేకరణ వివరాలు ఇవే...!
రిక్విజిషన్ డిపార్ట్‌మెంట్/ఏజెన్సీ మండలం పేరు గ్రామం పేరు మొత్తం ఎకరాలు
న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ ఓర్వకల్లు మీదివేముల 859.87
గుట్టపాడు 23.40
ఉన్నతవిద్య ఓర్వకల్లు నన్నూరు 147.74
డీఆర్‌డీఓ ఓర్వకల్లు కాల్వ 89.47
ఎన్.కొంతలపాడు 17.01
పాలకొలను 1266.84
ఉప్పలపాడు 555.53
ఉయ్యాలవాడ 368.19
వెల్దుర్తి బుక్కాపురం 424.85
ఎనర్జీ డిపార్ట్‌మెంట్ గడివేముల గని 1648.92
ఓర్వకల్లు శకునాల 1509.87
న్యూ అండ్ రెన్యువల్ ఎనర్జీ
డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పాణ్యం పిన్నాపురం 3794.06
ఏపీఐఐసీ ఓర్వకల్లు బ్రాహ్మణపల్లి 441.95
గుట్టపాడు 1194.36
కన్నమడకల 244.18
కేతవరం 2869.02
కొమరోలు 1712.94
లొద్దిపల్లె 1024.49
మీదివేముల 1849.90
ఎన్.కొంతలపాడు 95.98
ఓర్వకల్లు 904.93
పాలకొలను 261.85
పూడిచెర్ల 438.76
సోమయాజులపల్లె 1225.77
ఉప్పలపాడు 1043.26
ఏఐసీసీ జూపాడుబంగ్లా తంగడంచ 211.10
రామ్‌కో సిమెంట్స్ కొలిమిగుండ్ల ఇటిక్యాల 543.76
కలవట్ల 51.24
నందిపాడు 155.00
జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ జూపాడుబంగ్లా తంగడంచ 313.37
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఓర్వకల్లు ఓర్వకల్లు 1324.80
కన్నమడకల 754.89
పూడిచెర్ల 833.93
మొత్తం 28,236.43ఎకరాలు