అగ్ని ప్రమాదంలో ఓ కాలనీ మొత్తం బూడిదై పోయింది.
మచిలీపట్నం (కృష్ణా జిల్లా): అగ్ని ప్రమాదంలో ఓ కాలనీ మొత్తం బూడిదై పోయింది. పదిమందికి పైగా గాయాలపాలయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడి బీచ్ వద్ద వైఎస్ ఆర్ కాలనీలో గురువారం రాత్రి ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగినపూడి బీచ్ వద్ద వైఎస్సార్ ఫిషర్ కాలనీలో సుమారు 250 వరుకు గుడిసెలు ఉన్నాయి. సముద్రంలో చేపల వేట ద్వారా జీవనం సాగించే మత్స్యకారులు ఇక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు.
వీరంతా తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ నుంచి వలస వచ్చిన కార్మికులు. అయితే, చేపల వేటపై నిషేధంతో వీరిలో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఉప్పాడు వెళ్లారు. కొద్ది మంది మాత్రమే ఇళ్లలో ఉన్నారు. గురువారం రాత్రి ఈ కాలనీలో ఒక్కసారిగా మంటలు లేవగా... అన్నీ గుడిసెలే కావడంతో స్వల్ప వ్యవధిలోనే మొత్తం తగలబడిపోయాయి. అవనిగడ్డ, పామర్రు, బంటుమిల్లి, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి ఐదు అగ్ని మాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ప్రమాద సమయంలో గుడిసెల్లో ఉన్న కొందరు కొన్ని వస్తువులను తీసుకుని క్షేమంగా బయటకు రాగా, కొందరు మాత్రం పోయిన బంగారు వస్తువుల కోసం గాలించిన పరిస్థితి కనిపించింది. ఆస్తి నష్టంపై అధికారులు ఇంకా అంచనాకు రాలేదు. ప్రమాద స్థలిని ఆర్డీవో సాయిబాబు, తహశీల్దారు నారదముని, డీఎస్పీ శ్రవణ్‌కుమార్ పరిశీలించారు.