
అగ్రిటెక్ సదస్సులో బిల్‌గేట్స్‌కి ఆయన చిత్రపటాన్ని బహూకరిస్తున్న సీఎం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయరంగంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ ప్రకటించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే ప్రజల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడి సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. అందుకే ఆ రంగం అభివృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సహకారాన్ని అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విశాఖలో మూడురోజులు జరిగిన అగ్రిటెక్ సదస్సు ముగింపు సమావేశానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా సాగు విధానాలు, పంటలు మార్పు చెందాలని ఆకాంక్షిం చారు.భూమికి చెందిన పూర్తి సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం చిన్న కమతాల రైతుల వద్ద ఉంటే అతి తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చని, వ్యాపారులతో నేరుగా సంప్రదించి ఆదాయాన్ని సమకూర్చుకోగలరని, ప్రపంచ బ్యాంక్ సహకారంతో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇటువంటి కార్య క్రమాలను పలు దేశాల్లో చేపట్టిందని వివరించారు.
భారత్‌లో విత్తన కంపెనీలు రాజీపడుతున్నాయి
అమెరికా యూరప్‌లలో వెయ్యి రకాల విత్తనాలు అభివృద్ధి చేస్తే అన్ని పరీక్షలూ చేసి రైతులకు అత్యుత్తమైన వాటినే అందిస్తారని బిల్‌గేట్స్ చెప్పారు. కానీ భారత్ వంటి దేశాల్లో విత్తన కంపెనీలు లాభాల కోసం నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు మంచి విత్తనాలు అందేలా పాలకులు చూడాలన్నారు. భారత్‌లో మూడు అంశాల్లో తమ ఫౌండేషన్ ఆసక్తి చూపుతోందని బిల్‌గేట్స్ చెప్పారు. సామాజికాభివృద్ధి, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, ప్రపంచానికి ఎంతో అవసరమైన ఆహార ఉత్పత్తిని పెంచడం తమ ఫౌండేషన్ లక్ష్యాలన్నారు.
లాభసాటి వ్యవసాయానికి సహకరించండి: సీఎం
సమావేశంలో తొలుత మాట్లాడిన సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సహకారం అందించాలని బిల్‌గేట్స్‌ను కోరారు.ఏపీని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని, దీనిపై వేస్తున్న కమిటీకి తానే చైర్మన్‌గా ఉంటానని, గౌరవాధ్యక్షులుగా ఆ కమిటీకి గేట్స్ వ్యవహరించాలని కోరారు. అగ్రిటెక్ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 259 కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ లూ వచ్చాయని చంద్రబాబు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment