రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు కమిటీల ఏర్పాటుకు వామపక్షాలు, బీజేపీ కసరత్తు ప్రారంభించాయి. 29వ రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావ తేదీ ప్రకటించే నాటికి ఈ ప్రక్రియనూ పూర్తి చేయాలని యోచిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన నాటికి ప్రక్రియ పూర్తికి యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు కమిటీల ఏర్పాటుకు వామపక్షాలు, బీజేపీ కసరత్తు ప్రారంభించాయి. 29వ రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావ తేదీ ప్రకటించే నాటికి ఈ ప్రక్రియనూ పూర్తి చేయాలని యోచిస్తున్నాయి. ఇందుకు అనుమతి ఇవ్వాలని జాతీయ నాయకత్వాలను కోరాయి. జాతీయ పార్టీల ప్రస్తుత నిబంధనావళి ప్రకారం కొత్త కార్యవర్గాలను పార్టీ మహాసభల్లో ఎన్నుకోవడం ఆనవాయితీ. సీపీఐ, సీపీఎం, బీజేపీ నూతన కార్యవర్గాలు ఏర్పడి ఏడాదిన్నర కూడా కాలేదు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి, వామపక్షాలలో రాష్ట్ర కార్యదర్శుల పదవులు కీలకమైనవి. మహాసభల్లో కాకుండా నూతన కార్యవర్గాలను ఎన్నుకునే అవకాశం లేనందున ప్రస్తుతం తాత్కాలిక కమిటీలను నియమించి ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నాయి. బీజేపీలో ఆయితే తెలంగాణకు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డినే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగే తెలంగాణ ప్రాంత పదాధికారుల సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ సీనియర్లు డాక్టర్ కె.హరిబాబు, సోము వీర్రాజు, శ్రీనివాసరాజుల్లో ఒకర్ని నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
27న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీ
రాష్ట్ర సమితి సమావేశాల్ని ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం ఈనెల 27న, పార్టీ కార్యవర్గం వచ్చేనెల 6న సమావేశం కానున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సీపీఐ సీమాంధ్ర కమిటీ కన్వీనర్ పదవిపై గుంటూరు జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రస్తుత కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామకృష్ణ ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ప్రాంతాలకయితే ప్రస్తుత కార్యదర్శివర్గ సభ్యులు సిద్ది వెంకటేశ్వర్లు, చాడా వెంకటరెడ్డి, అజీజ్‌పాషా రేసులో ఉన్నారు. ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న కె.నారాయణను దేశ రాజధానికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.
వచ్చేనెలలో సీపీఎం నిర్ణయం
సీపీఎం కూడా దాదాపు ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. తెలంగాణ ప్రాంత పార్టీ బాధ్యతలను ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాముల్లో ఎవరో ఒకరికి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుత కార్యదర్శి బీవీ రాఘవుల్ని ఢిల్లీ సెంటర్‌కు పంపే పక్షంలో అదేస్థాయి ఉన్న నేత కోసం వెతుకుతున్నారు. ఢిల్లీ కేంద్రంలో పని చేస్తున్న కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి. శ్రీనివాసరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. శనివారమిక్కడ జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఈవిషయమై చర్చ జరిగినప్పటికీ ఎటూ తేల్చుకోలేక పోవడంతో వచ్చేనెల 1, 2 తేదీల్లో జరిగే సీపీఎం కేంద్ర కమిటీకి ఈ వ్యవహారాన్ని నివేదించాలని భావించినట్టు తెలిసింది.