వేగు చుక్కలే..తోకచుక్కౖలై | Telangana polls: Communist Party | Sakshi
Sakshi News home page

వేగు చుక్కలే..తోకచుక్కౖలై

Published Fri, Nov 3 2023 4:05 AM | Last Updated on Fri, Nov 3 2023 6:29 PM

Telangana polls: Communist Party  - Sakshi

బొల్లోజు రవి: కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగాయి.  ఆ పార్టీల నేతృత్వంలోని సాయుధ పోరాటంతో తెలంగాణలో ఊరూరా ఎర్రజెండా రెపరెపలాడింది. కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూత లూగించేవి. మార్క్సిస్ట్‌ సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్లింది.

ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. అలాంటి కమ్యూనిస్టు పార్టీల కోటలు ఇప్పుడు బీటలువారాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోగా, తాజాగా  ఒంటరిగా బరిలో దిగేందుకు సీపీఎం సిద్ధం కాగా,  సీపీఐ కూడా అదే దారిలో పయనిస్తుందనే చర్చ జరుగుతోంది. 

ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య నుంచి జీరో స్థాయికి దిగజారి..   
1952 ఎన్నికల నాటికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్‌ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీకి ఎక్కువ సీట్లే వచ్చినా, కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలతో కలిసి 1953లో ప్రకాశం పంతులు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కాగా, తెలంగాణ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో కలిపి హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉండేది. తెలంగాణలో భాగంగా 1952లో కాంగ్రెస్‌కు 38 సీట్లు రాగా, పీడీఎఫ్‌ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చాయి. ఇక 1957లోనూ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు సాధించి ప్రతిపక్ష స్థానం పొందింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 177 సీట్లు సాధిస్తే, సీపీఐ (అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ) 51 సీట్లతో ప్రతిపక్ష స్థానం సంపాదించింది. ఇక ఆ తర్వాత సీపీఐలో చీలిక వచ్చి సీపీఐ, సీపీఎంలుగా విడిపోయాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు మూడు, నాలుగో స్థానానికి చేరుకున్నాయి.

అప్పుడు సీపీఐకి 10, సీపీఎంకు 9 స్థానాలు దక్కాయి. 1972 ఎన్నికల్లో సీపీఐకి 7, సీపీఎంకు ఒక స్థానం లభించింది. ఎనీ్టఆర్‌ అసెంబ్లీ రద్దు చేశాక 1985లో జరిగిన ఎన్నికల్లో చెరి 11 స్థానాలు దక్కించుకొని మళ్లీ తమ సత్తా  చాటాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 8, సీపీఎంకు 7 స్థానాలు రావడం గమనార్హం. 1989లో మళ్లీ సీట్లు తగ్గాయి. అయితే 1994లో కమ్యూనిస్టు పార్టీలు మళ్లీ పూర్వవైభవం దిశగా ముందుకొచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ సీట్లు సాధించారు. కాంగ్రెస్‌ రెండో స్థానంలో 26 సీట్లు సాధించగా, సీపీఐ, సీపీఎంలు కలిపి కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా 34 సీట్లు సాధించడం విశేషం.

విడివిడిగా సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు సాధించాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో సీపీఐకి 13, సీపీఎంకు 8 సీట్లు రావడం విశేషం. 1999లో జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు రెండు స్థానాలే దక్కగా,  సీపీఐకి ఒక్కటీ రాలేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాలు సాధించాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 6, సీపీఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇక సీపీఐ, సీపీఎంల పరిస్థితి దిగజారుతూ పోయింది. అంటే 20 ఏళ్లుగా ఆ రెండు పార్టీలు చతికిలపడి పోయాయి. 2018 ఎన్నికల్లో ఒక్క సీటూ రాని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. 

రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పుంజుకోని వైనం.. 
రాష్ట్రం ఏర్పాటయ్యాక తిరిగి కీలకమైన స్థానంలోకి రావాల్సిన సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఒక రకంగా తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర ప్రకారం చూస్తే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సి ఉండేదని ఆ పార్టీల సానుభూతిపరులు చెబుతుంటారు.   

ఎందుకీ దుస్థితి అంటే..  
కమ్యూనిస్టు పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చిన కారణాలు అనేకమనే చెప్పాలి.  కొత్త తరం కమ్యూనిస్టు భావజాలం వైపు రావడం లేదని,  మారుతున్న కాల పరిస్థితులను బట్టి నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. నాడు నాయకుల త్యాగాలు కేడర్‌లో ఉత్సాహం నింపగా, నేటి నాయకుల తీరుపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.  

కమ్యూనిస్టులు చెబుతున్న కారణాలు 

  • కమ్యూనిస్టు పార్టీలు ఎదగకపోవటానికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బు కుమ్మరించడం, కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు చేయడం. 
  • గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుండటం వల్ల ప్రజాపోరాటాలు లేకుండా పోయాయి. వ్యవసాయ కార్మిక, రైతు పోరాటాలు పెద్దగా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల ప్రజలు, కమ్యూనిస్టులకు మధ్య కొంత గ్యాప్‌ పెరిగింది. 
  • బూర్జువా పార్టీల నాయకులు వ్యాపారాలు చేస్తూ కార్యకర్తలను తమతో తిప్పుకుంటున్నారు. తమ తమ ప్రాంతాల్లో పెళ్లిళ్లయినా, ఏ ఇతర శుభకార్యాలైనా వెళ్లి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నాయకులు ఎన్ని తప్పు పనులు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా పక్కదారి పట్టిస్తున్నారు. కమ్యూనిస్టులు ఇలాంటివి చేయకపోవడం వల్ల ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. 
  • బూర్జువా పార్టీల నాయకులు డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజలను తమ వెంట తిప్పుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులు ఇస్తూ కాపాడుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కానీ కమ్యూ నిస్టులు ఇవేవీ చేయకుండా త్యాగాలు చేయాలని కోరడం ఎవరికీ నచ్చడం లేదు. 
  • సిద్ధాంతపరమైన రాజకీయాలు ఇప్పుడు లేకుండాపోయాయి. ధనమే అన్నింటికీ మూలంగా మారింది.  

రాజకీయ విశ్లేషకుల మాట... 

  • మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించడంలో కమ్యూనిస్టులు విఫలం అవుతున్నారు. 
  • తమ బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించడం లేదు. ప్రజలకు దగ్గర కావడానికి అవసరమైన చర్యలు చేపట్టడం లేదు.  
  • కొందరు నాయకుల తీరు, వారి వ్యవహార శైలి ప్రజలను ఆకట్టుకోవ డం లేదు. కమ్యూనిస్టు ఆదర్శాలను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి.  పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి నేతలు తమ సాధారణ జీవన శైలితో కార్యకర్తలు గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పుడు అలాంటి నేతలు లేరన్న విమర్శలు ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement