
తెలంగాణపై మా వైఖరి సుస్పష్టం: వెంకయ్య
బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తాం: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ వైఖరి సుస్పష్టంగా ఉందని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కట్టుబడి ఉన్నామని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తామని, సీమాంధ్ర సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, ఎన్.ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు, అశోక్‌యాదవ్‌తో కలిసి ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. బిల్లు పార్లమెంటుకు వస్తుందా.. లేదా? వస్తే ఏమవుతుంది వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే తెలంగాణను ఒక్కరోజులో కూడా ఇవ్వొచ్చని చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా నిజాం నవాబు పాలనను కీర్తించడాన్ని తప్పుబట్టారు. రజాకార్ వారసులు నిజాంను సమర్థించడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు.
నిజాంను పొగడటాన్ని టీఆర్‌ఎస్ నేతలు ఎలా సమర్థిస్తారని ఆక్షేపించారు. 1931లో ప్రకటించిన నిజాం గెజిట్‌ను చూస్తే హిందువులను ఎంత హీనంగా చూశారో అర్థమవుతుందన్నారు. పండక్కీ, పబ్బానికీ, పెళ్లికీ, చివరకు జుట్టుకు కూడా పన్ను విధించిన నిజాంను కీర్తించడం దారుణమని, రజ్వీ దురాగతాలను తెలుసుకోవాలనుకుంటే సురవరం ప్రతాప్‌రెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదవాలని సలహా ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పని అయిపోయిందని, ఆ పార్టీ ఆందోళనలు చేయడానికి తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పనికి రాదని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు తన సత్తా ఏమిటో తెలిసొచ్చిందని, అందుకే ధర్నా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ సమావేశాల్లో నరేంద్రమోడీ ప్రసంగం దేశ భవిష్యత్‌ను ఆవిష్కరించిందని చెప్పారు.