సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్‌లో సీమాంధ్ర ప్రాంత లోక్‌సభ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ను టీఆర్‌ఎస్ నేతలు విమర్శించడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ లేకుండా టీఆర్‌ఎస్ తెలంగాణను తీసుకురాగలుగుతుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసమే టీవీ ఛానల్ పెట్టామంటూ అదే చానల్‌లో బీజేపీని లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్ వ్యతిరేక ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం పోరాడిన ఏకైక వ్యక్తి సుష్మాస్వరాజ్ అని, కావాలంటే పార్లమెంట్ రికార్డులను పరిశీలించుకోవచ్చని చెప్పారు. పార్లమెంట్‌కు వెళ్లని టీఆర్‌ఎస్ నేతలు తమ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ను విమర్శిస్తున్నారంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాల న్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయ డం కాదని, సీడబ్ల్యూసీ నిర్ణయా న్ని వ్యతిరేకిస్తున్న వారిని పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమాంధ్ర ఉద్యమం సోనియా ఆడిస్తున్న నాటకమే. ఆమె ప్రమేయం, అంగీకారం లేకుండా ముఖ్యమంత్రి సీమాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఉంటారా? సోని యా అంగీకారం లేకుండా పీసీసీ అధ్యక్షుడు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తారా?’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఏ పార్టీతోనూ పొత్తులుండవు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ పొత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన.. అసలు టీడీపీ తెలంగాణలోనే ఉండదు. ఇక పొత్తు ఎక్కడ ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. బీసీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ అమలు చేయాలంటూ బీజేపీ ఈ నెల 26, 27 తేదీల్లో ఉపవాస దీక్ష చేపడుతున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
సీమాంధ్రుల ఆందోళనల్లో న్యాయం లేదు: నాగం
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రులు చేస్తున్న డిమాండ్‌లో న్యాయం లేదని బీజేపీనేత, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఆయన 1100 మందితో కలిసి ‘తెలంగాణ స్వయం పాలన సాధనా దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ సీమాంధ్రులు సంపద, ఉద్యోగాలు, నీళ్లు దోచుకుంటూ తెలంగాణ ప్రజల పొట్టకొడుతున్నారన్నారు. పార్లమెంటులో బిల్లుపెట్టే వరకు కాంగ్రెస్‌ను నమ్మలేమన్నారు. కాగా, ‘మా తెలంగాణ మాకు కావాలనే నినాదంతో ఎంతోమంది ఇంటిల్లి పాదిని వదిలేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఉద్యమంలో పాల్గొని పోలీసు బుల్లెట్లకు బలయ్యారు. ఎందరో ప్రాణత్యాగం చేశారు. నాటి సంఘటనలు గుర్తుకు వస్తే బాధేస్తుంది... ఎంత కాలం ఈ అవమానాలు... అఘాయిత్యాలు’ అంటూ ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ నాగం కంటతడిపెట్టారు.
బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ సాధ్యమా?: కిషన్‌రెడ్డి
Published Sun, Aug 25 2013 5:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement