సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చతో పాటు ఓటింగ్ జరగాలనే తమ పార్టీ కోరుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. గురువారం నాడిక్కడ మాజీ ఎంపీ జి.ఆత్మచరణ్ రెడ్డి, యువజన సంఘం నేత ఓరం జయచందర్, సేవాసంస్థల నేతలు నాయిని నరోత్తమ్‌రెడ్డి, బోడ శ్రవణ్, మహిపాల్‌రెడ్డి తదితరులు తమ అనుచరులతో కలసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. సభను సజావుగా నడుపుతూ బిల్లు ప్రవేశపెట్టాలని లోక్‌సభలో తమనేత సుష్మా స్వరాజ్ కోరితే దాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని అడగడమే పాపమా? అని ప్రశ్నించారు. నష్టమేదైనా జరిగితే సోనియా వల్లే జరిగిందని, సోనియా తమ పాలిట దెయ్యమే తప్ప దేవత కాదన్నారు.
వెంటిలేటర్‌పై ఉన్న కేంద్రం పార్లమెంట్‌లో 39 బిల్లులు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసి ఢిల్లీకి వెళ్లి ఉరేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ, కె లక్ష్మణ్, యెండల లక్ష్మీనారాయణ, ఎన్.రామచంద్రరావు, బి.వెంకటరెడ్డి, ఎస్.కుమార్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. కాగా, విభజన బిల్లుపై అనుమానాల నివృత్తికి కిషన్‌రెడ్డి నాయకత్వంలో పలువురు తెలంగాణ నేతలు శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నారు. టి.రాజేశ్వరరావు, ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, పది జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ బృందంలో ఉన్నారు.
ఓటింగ్ జరగాల్సిందే : కిషన్ రెడ్డి
Published Fri, Feb 7 2014 4:24 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement