విభజన బిల్లుకు పూర్తి మద్దతు: బీజేపీ
గడువులోపు తిప్పిపంపాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు లోపు దాన్ని కేంద్రానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చలో భాగంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణకు బీజేపీ 2006లోనే తీర్మానం చేసిందని గుర్తు చేశారు.
అప్పట్లో సరైన మెజారిటీ లేకపోవడం, చంద్రబాబు ఒత్తిడి కారణంగా 3 రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తెలంగాణను ఇవ్వలేకపోయామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు ముద్దుకృష్ణమ జోక్యం చేసుకున్నారు. రాజధానిగా ఉన్న ప్రాం తాన్ని ప్రత్యేక రాష్ర్టం చేయబోమని హోం మం త్రి హోదాలో బీజేపీ నేత అద్వానీ పార్లమెంట్‌లో అన్నారని గుర్తు చేశారు. అది అద్వానీ అభిప్రాయమని, బీజేపీ అభిప్రాయం తెలంగాణకు అనుకూలమని యెండల బదులిచ్చారు. అద్వానీ హోం మంత్రి హోదాలో దేశ ప్రతినిధిగా ఆ మాట చెప్పారు తప్ప ఎంపీగా చెప్పలేదని సీఎం కిరణ్ అన్నారు.