‘అసెంబ్లీకి తీసుకురావాలన్నా సిగ్గేస్తుంది’
అమరావతి: ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే వారిని అసెంబ్లీకి తీసుకురావాలన్నా సిగ్గేస్తోందని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. బీజేఎల్పీ కార్యాలయం అష్టవంకర్లతో ఉందని, బీజేపీకి మరీ ఇంత చిన్న రూమా అంటూ ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేఎల్పీ రూమ్ చూస్తే తనది చేతగానితనం అనే భావన...ఢిల్లీ పెద్దలకు కలుగుతుందని, అందుకే వారిని పిలవడం లేదన్నారు. బాత్‌రూమ్ లేదని మంత్రులను అడిగితే... తమదీ అదే పరిస్థితి అన్నారని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. ఆరుగురు మంత్రులకు ఒకే బాత్రూమ్ కేటాయించడం దారుణమన్నారు.
స్కూళ్లు, కాలేజీలు కట్టినట్టలు అసెంబ్లీని కట్టారని ఆయన వ్యాఖ్యానించారు. అద్దె కావాలన్నా చెల్లిస్తానని, బీజేఎల్పీ కార్యాలయం మార్చమని కోరతానని అన్నారు. ఆ మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై తాను చేసిన వ్యాఖ్యలు తనకే బాధనిపిస్తోందని, అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. కాగా గతంలో పలువురు మంత్రులు కూడా తమ ఛాంబర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.