శాసనసభలో ఎమ్మెల్యేలకు జీతాలు పెంచే ప్రసక్తే లేదని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో వైఎస్సార్ సీపీ పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ రెండేళ్లు గడుస్తున్నా, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని, తెలంగాణలో ఎమ్మెల్యేలకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచే అంశం పరిశీలించాలని సభ దృష్టికి తెచ్చారు.
ఇందుకు మంత్రి యనమల సమాధానమిస్తూ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచాలంటే చట్ట సవరణ చేయాలని, సౌకర్యాలు, వసతి కల్పన కమిటీకి (ఎమినిటీస్ కమిటీ) సిఫారసు చేయాలన్నారు. గిరిజన సలహా మండలి కమిటీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదో.. సమాధానమివ్వాలని, పలు మార్లు సంబంధిత మంత్రికి వినతి చేసినా ఫలితం లేదని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించగా, మంత్రి రావెల కిషోర్‌కుమార్ సూటిగా సమాధానమివ్వకుండా పరిశీలిస్తామంటూ దాటవేశారు.
కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది వర్షాలు లేవని, తుంగభద్ర బేసిన్‌లో కురిసిన వర్షాలకు శ్రీశైలంలో 60 టీఎంసీల నీరు చేరిందని, ఈ నీటిని రాయలసీమకు ఇవ్వడం లేదని, పట్టిసీమ నుంచి నీటి మాట దేవుడెరుగు.. వెలుగోడు రిజర్వాయర్ కింద రబీలో పంటలు వేసుకున్న రైతులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.