అయ్యో పాపం....హస్తం లేని అసెంబ్లీ
127 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతం ఎంతో ఘనకీర్తి అన్నట్లు నేడు ఆ పార్టీ స్థానం ఆంధ్రప్రదేశ్లో సున్నాకు పడిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కనీవిని ఎరుగని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
దాంతో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేని దుస్థితి నెలకొనటంతో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. కాగా ఈసారి వామపక్ష పార్టీలు కూడా ఒక్క స్థానాన్ని కూడా రాబట్టుకోలేకపోయింది. దాంతో కమ్యూనిస్టులు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కోల్పోయారు. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ, లోక్సత్తా పార్టీ ఎన్నికల రణరంగంలో నిలిచినా బోణీ కొట్టలేకపోయాయి.
దాంతో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కేవలం మూడంటే... మూడు పార్టీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అధికార, మిత్ర పక్షాలుగా తెలుగుదేశం, బీజేపీలు ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను పోషిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది. తెలుగుదేశం పార్టీ 102 స్థానాలను గెలుచుకోగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 67 స్థానాల్లో విజయపతాకం ఎగరేశారు.
అలాగే మరో రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టీడీపీ పార్టీ రెబెల్ అభ్యర్థి వర్మ విజయం సాధించి అనంతరం సొంతగూటికే వెళ్లిపోయారు. ఇక ప్రకాశం జిల్లా చీరాలలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. ఆయన మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.