రాజు గారూ మీకో నమస్కారం...!!
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ఈ మధ్య కాలంలో టీడీపీ వాళ్ల నుంచి పలకరింపులు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేలే కాదు... మంత్రులు కూడా రాజు గారూ... నమస్కారం అంటూ పలకరిస్తుండటంతో ఆయన కొంత ఆనందానికి లోనయ్యారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఈ పలకరింపులు ఎక్కువయ్యాయి. సాధారణంగా ఒక అర్జీ ఇచ్చిన తర్వాత పదిసార్లు తిరిగితే తప్ప మాట్లాడని మంత్రులు కూడా పలకరిస్తుంటే విషయమేంటో విష్ణుకుమార్ రాజుకు మొదట్లో అర్థం కాలేదు.
అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఈ పలకరింపుల్లోని అసలు రహస్యం ఆయనకు తెలిసింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది. ఆ పార్టీపై విమర్శలు చేసినప్పుడు వాటిని సమర్థించడానికి మరో పార్టీకి చెందినవారైతే బాగుంటుందని అధికార పార్టీ నేతలు ఆ ఐదు రోజులు విష్ణుకుమార్‌రాజుకు ఎక్కడలేని ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. దాంతో ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు రాజకీయ చాణక్యుడని, ఎంతో చతురత కలిగిన వాడని ఏకంగా అసెంబ్లీలోనే పొగడ్తల్లో ముంచెత్తారు.
పలకరింపులు ఎక్కువయ్యేసరికి సందర్భం వచ్చినప్పుడల్లా విష్ణుకుమార్‌రాజు సైతం ప్రతిపక్షాన్ని తప్పుబడుతూ అధికార పక్షం నిర్ణయాలను సమర్థిస్తూ వెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీల పేరుతో నిరుపేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విషయంలో కూడా బీజేపీకే చెందిన మంత్రిని సభలో గట్టిగా ప్రశ్నించకుండా సర్దుకున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి పలకరింపుల వలలో పడిన విష్ణుకుమార్ రాజు ఇదే అదనుగా సభ బయట పలు మంత్రులకు పలు అర్జీలు సమర్పించారు. ఆ మంత్రులు సైతం దానిదేముంది.. చేసేద్దాం...! అంటూ వ్యక్తిగత సిబ్బందికి పురమాయించారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం ముందురోజు నుంచి వాయిదా పడిన మర్నాటి వరకు అంతా బాగానే సాగింది. అంతే... ఇప్పుడు ఆ అర్జీల సంగతేంటో తెలుసుకుందామని ఒక మంత్రి పేషీకి వెళితే సదరు మంత్రి గారు ఎక్కడున్నారో సమాచారం లేదన్నారట. మరో మంత్రికి ఫోన్ చేస్తే ఫోనెత్తలేదట. అప్పుడు గానీ విష్ణుకుమార్‌రాజుకు అసలు విషయం బోధపడలేదు. ఎంతో చనువుగా పలకరించి... అసెంబ్లీలో ఎంతో బాగా మాట్లాడుతున్నారంటూ పొగడిన వారెవరూ ఇప్పుడు అందుబాటులోకి రావడం లేదట. అసెంబ్లీ అయిపోయిది. మళ్లీ అసెంబ్లీ సమావేశాల వరకు ఆయనతో అవసరం లేదు. విష్ణుకుమార్‌రాజుకు ఎంతో ఆలస్యంగా గానీ బోధపడలేదట...! రాజు గారూ మీకో నమస్కారం...!! లోని అర్థం, పరమార్థం.