హవ్వా.. ఇదేంటండీ రాజుగారూ?
ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధికార టీడీపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆ పార్టీ పెద్దలను సైతం విస్మయపరుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రతి విషయంలోనూ అధికార పార్టీ సభ్యులకు మించి ఆయన సమర్థించడం బీజేపీలోనే చాలా మంది నేతలకు మింగుడుపడటం లేదు. సోమవారం ఏకంగా పసుపు రంగు చొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చిన ఆయన పక్కా టీడీపీ నేతగా మాట్లాడారని బీజేపీ నేతలు కొందరు గుర్రుమంటున్నారు. మంత్రులపై, ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేసిన సందర్బంలో విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ టీడీపీ నేతలను మించిపోయే విధంగా చంద్రబాబును సమర్థించడం.. బీజేపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 5 వ తేదీ నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ రాజధాని అమరావతి సమీపంలో మంత్రులు, వారి బినామీలు భూముల కొనుగోలు చేశారని, ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ సందర్భంలో విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని, లేదంటే సభకు క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం వాదననే పూర్తిగా సమర్థించారు. తాజాగా సోమవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా విష్ణుకుమార్ రాజు ఇదేవిధంగా ఒకటికి నాలుగుసార్లు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు.
పోలవరం కాంట్రాక్టుల్లో అవకతవకలు, సోలార్ ప్రాజెక్టుల్లో అవకతవకలు, బొగ్గు కొనుగోలు కుంభకోణంపై జగన్ మోహన్ రెడ్డి పలు అంశాలు లేవనెత్తి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఇప్పటికిప్పుడు ఆధారాలు ఇవ్వాలి... లేదంటే ప్రతిపక్ష నేతకు మాట్లాడే అర్హత లేదు అంటూ దబాయింపు ధోరణితో మాట్లాడారు. అదే సమయంలో విష్ణుకుమార్ రాజు లేచి అధికార పార్టీ సభ్యులకన్నా రెండడుగులు ముందుకేశారు. ముఖ్యమంత్రి కోరినట్టుగా జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. మూడు నాలుగుసార్లు సందర్భాల్లో అదే చెప్పారు. ఆ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల సమయంలో శ్రీకాకుళం జిల్లా బీచ్ శాండ్ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తేగానే విచారణకు ఆదేశించారని, తనలా ఏమైనా ఆధారాలుంటే సమర్పించాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలన్నారు. నిజానికి బీచ్ శాండ్ అంశాన్ని విష్ణుకుమార్ రాజు ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి సభలో లేరు. పైగా ఆ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు కూడా. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే సీఎం సభలో లేరని గుర్తుచేసారు. పైగా తాను పసుపు రంగు చొక్కా వేసుకుని సభకు వచ్చానన్నారు. అడగ్గానే విచారణకు అంగీకరించారని విష్ణుకుమార్ రాజు చెప్పినప్పటికీ బీచ్ శాండ్ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు.
పసుపు చొక్కా వేసుకొచ్చానని తనకు తానే సభలో చెప్పుకుని మరీ ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా చంద్రబాబు చెప్పే ప్రతి విషయాన్నిఆయన సమర్థించడం ఇబ్బందికరంగా ఉందని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. మిత్రపక్షమైనంత మాత్రాన అన్ని విషయాలను గుడ్డిగా సమర్థించడం మంచిది కాదని రాయలసీమకు చెందిన బీజేపీ యువ మోర్చా నేత ఒకరు వ్యాఖ్యానించారు. పచ్చ చొక్కా వేసుకుని మరీ పచ్చిగా టీడీపీని సమర్థించడం వల్ల రేపటి రోజున పార్టీకి ఇబ్బందులు వస్తాయని వారంటున్నారు.
మిత్రపక్షమైనందున ప్రతి విషయాన్నీ సమర్థించారని అనుకున్నా... ముఖ్యమంత్రి, మంత్రులు పలువురు సభలో సంప్రదాయానికి భిన్నంగా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించిన సందర్భాల్లోనైనా విష్ణుకుమార్ రాజు తప్పుపట్టకపోవడమేంటని బీజేపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మీది దివాలాకోరు పార్టీ, నీలాంటి దుర్మార్గులు ఉండరు... దమ్ముందా... మగతనముంటే... కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు... వంటి సంస్కారహీనమైన మాటలు ఉపయోగించినప్పుడైనా తెలుగుదేశం నేతలను ఆయన తప్పుబట్టలేకపోవడంలోని ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని సీనియర్ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.