జవహర్‌ జవదాటు | bjp mlc somu veerraju Fire on Samuel Jawahar | Sakshi
Sakshi News home page

జవహర్‌ జవదాటు

Published Mon, Nov 20 2017 7:38 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

bjp mlc somu veerraju Fire on Samuel Jawahar - Sakshi

చెప్పుల కాళ్లతో శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాల   తొలగింపుపై  చింతిస్తున్నాం. కమిటీ రాతపూర్వకంగా వినతి  పత్రం అందజేస్తే విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. హిందువుల మనోభావాలను గౌరవిస్తాం.
– కేఎస్‌ జవహర్, రాష్ట్ర పొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి 
(శుక్రవారం మాట్లాడిన మాటలివీ..)

శ్రీనివాస స్నాన ఘట్టంలో 
నీటిపారుదల శాఖ స్థలంలో అనుమతి లేకుండా పూజలు, ఇతర కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. నిర్వహిస్తే శాంతిభద్రతల దృష్ట్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  
– ఎస్‌బీవీ శుభాకర్, 
ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు, పట్టణ పోలీసు స్టేషన్, కొవ్వూరు
(ఈ మేరకు నోటీసూ జారీ చేశారు) 

కొవ్వూరు:  జవహర్‌ అన్నమాట జవదాటారా? హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదా.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. శ్రీనివాస స్నానఘట్టంలో నిషేధాజ్ఞలు విధిస్తూ.. పోలీసులు తాజాగా జారీ చేసిన నోటీసు హిందువుల్లో ఆగ్రహం రేపుతోంది. 

కానరాని ప్రభుత్వ చొరవ 
కొవ్వూరు శ్రీనివాస స్నానఘట్టంలో చెప్పుల కాళ్లతో శివుడు, వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాల తొలగింపు వ్యవహారంపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఈ దుశ్చర్యను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు.  భక్తులకు మద్దతు తెలిపారు. సున్నితమైన ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపాల్సిన  ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పైపెచ్చు సమస్యను మరింత జఠిలం చేసేలా యత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

గుర్తుకొచ్చిన శాంతిభద్రతలు 
ఓ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ.. విగ్రహాలు తొలగించిన రోజున గుర్తుకురాని శాంతిభద్రతలు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకొచ్చాయి. విగ్రహాల తొలగింపును నిరసిస్తూ.. శుక్రవారం భక్తులు శివలింగానికి 108 బిందెలతో అభిషేకాలు చేశారు. మంత్రి కేఎస్‌ జవహర్‌కు, ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గణపతి హోమం చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు చిర్రెత్తుకు వచ్చింది. శాంతి భద్రతలు గుర్తుకు వచ్చాయి. స్నానఘట్టంలో అనుమతిలేకుండా ఎలాంటి పూజలు, ఇతర కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, అలాచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల ద్వారా తాఖీదులు జారీ చేసింది. ఈ చర్య సమస్యకు ఆజ్యం పోసినట్టయింది.

శాంతియుతంగానే ఆందోళన
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసంలో శివరాధనకు అంత్యంత ప్రాముఖ్యం ఉంది. విగ్రహాలు తొలగించిన ప్రదేశంలోనే పునః ప్రతిష్ఠించాలని  కొద్దిరోజుల నుంచి భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి. భక్తులకు అండగా నిలిచాయి. చేతికి సంకెళ్లు వేసుకుని, నోటికి æనల్ల రిబ్బ న్లు కట్టుకుని అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. అధికారులకు, దేవాదాయ శాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పిం చారు. ఇప్పటి వరకు ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన దాఖాలాల్లేవు. విగ్రహాలు తొలగించిన రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. అనంతరం నిర్వహించిన కార్యక్రమాలన్నీ శాంతియుత మార్గంలోనే నడిచాయి. ఇలాంటి తరుణంలో పోలీసులు తాఖీదులు ఇవ్వడం దూమారం రేపుతోంది.

విగ్రహాలు ప్రతిష్ఠించాలి : సోము వీర్రాజు 
ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నాయకులతో కలిసి విగ్రహాలు తొలగింపు ప్రాంతాన్ని సందర్శించారు. వెంటనే విగ్రహాల ప్రతిష్ఠకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌  చేశారు. విగ్రహాలను పునః ప్రతిష్ఠించి తీరుతామని ఆయన ప్రకటించడం, శాసనమండలిలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. స్నానఘట్టంలో పోలీసులు మోహరించడంపై ఆయన మండిపడ్డారు. ఇంతమంది పోలీసుల అవసరమేముందని, తమను అరెస్టు చేస్తారా అని ఘాటుగా ప్రశ్నించారు.  

టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయాలి 
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రమైన కొవ్వూరులో టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయాలని, రిసార్ట్‌ల పేరుతో భక్తికి విరుద్ధమైన బార్లు ఏర్పాటు చేయకూడని డిమాండ్‌ చేశారు. గోదావరి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని నదీతీరంలో చెత్త డంపింగ్‌ చేయడం, పందుల ఆవాసాలు ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టెంపుల్‌ టూరిజం అభివృద్ధిపై కలెక్టర్, మంత్రి జవహర్, దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులతో మాట్లాడతానన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ముప్పరాజు శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బీవీ ముత్యాలరావు, నాయకులు పరిమి రా«ధాకృష్ణ, పిల్లలమర్రి మురళీకృష్ణ, సలాది సందీప్‌కుమార్, దేవగుప్తాపు లక్ష్మణరావు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కొండపల్లి రత్నసాయి, మాసా ఆనంద్, వీరమాచినేని చైతన్య, పెరుగు పోతురాజు, మండల పార్టీ అధ్యక్షుడు గన్నమని భాస్కరరావు, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్, దళిత విభాగం రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి విజయరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల ఉదయభాస్కరరావు, నాయకులు నగళ్లపాటి శ్రీనివాస్, అడ్డూరి సుబ్బారావు,స్ధానికులు అనపర్తి శివరామ కృష్ణ, ఉప్పులూరి కృష్ణారావు, ఆర్యాద్యుల రాధాదేవి తదితరులు వెంట ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఘటనా స్థలానికి రాని టీడీపీ నాయకులూ విగ్రహాలు తొలగించిన ప్రాంతాన్ని సందర్శించి చెప్పులతో విగ్రహాలు తొలగింపును ఖండిస్తున్నట్టు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement