రైతు సమస్యలపై బీజేపీ సమరశంఖం
Published Wed, Oct 22 2014 12:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వంపై సమర శంఖం పూరించింది. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు దిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
ఇది దివాలాకోరు సర్కారు
ఎన్నికల హామీలో ఒక్కటీ అమలు చేయలేదు
నెట్‌వర్క్: తెలంగాణలో రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికార పార్టీపై సమర శంఖం మోగించింది. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మంగళవారం తెలంగాణవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు దిగింది. కార్యక్రమాలకు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు సారథ్యం వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. బంగారు తెలంగాణ నినాదంతో గెలిచిన టీఆర్‌ఎస్ సర్కారు.. ఆత్మహత్యల తెలంగాణను నిర్మించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల కరెంటు, రుణమాఫీ అంటూ గొప్పలకు పోయిన కేసీఆర్.. చివరకు విద్యుత్తు సరఫరాపై చేతులెత్తేయడం సర్కారు చేతగానితనానికి నిదర్శనమని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతు రబీపై ఆశలు పెట్టుకున్నారని, ప్రస్తుత సర్కారు వైఖరి చూస్తుంటే రబీలో సైతం నష్టాల్లోకి నెట్టేసేలా ఉందని వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి ఎనిమిది గంటల కరెంటు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు సాగుకు కరెంటు కోతలు పెట్టారని, పరిశ్రమలకు ఏకంగా పవర్ హాలీడే ప్రకటించారని మండిపడ్డారు. ఇప్పటికీ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయడంలేదని, ఫలితంగా ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇందులో అధికంగా సీఎం సొంత నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల కరెంటు ఇస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు ఒప్పందం చేసుకోకపోవడం కేసీఆర్ చిత్తశుద్ధి స్పష్టమవుతుందన్నారు. పొరుగు రాష్ట్రాలను నిందించడం మాని, ఇక్కడి సాగు సమస్యల్ని అధిగమించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముందుగా లక్డీకాపూల్ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్న బీజేపీ శ్రేణులు.. కలెక్టరేట్ గేటు ఎదుటకు వచ్చేందుకు ప్రయత్నించారు. మెట్రోరైలు పనులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా వారిని రైల్వేస్టేషన్ సమీపంలోనే అరెస్టు చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కిషన్‌రెడ్డి ప్రసంగం ముగిసిన వెంటనే అందరిని అరెస్టు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు ఇంద్రసేనారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజన్‌కుమార్, బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు సుబాష్‌చందర్‌జీ, పోరెడ్డి నర్సింహారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, జి.లచ్చిరెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద ఎంపీ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి వెళ్లారు. సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. దత్తాత్రేయతో పాటు పలువురు నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. తర్వాత వారిని వదిలేశారు. ధర్నాలో, తర్వాత హన్మకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దుందుడుకుగా, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని, ఇలాగే కొనసాగితే నియంతృత్వ పోకడలకు దారితీస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీల మధ్య ఏర్పడే సమస్యలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించి పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో కేంద్రం తలదూర్చడం మంచి పద్ధతి కాదన్నారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఆదిలాబాద్‌లో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ తీశారు. రైతు ఆత్మహత్య నమూనా ప్రదర్శన నిర్శహించారు.
నల్లగొండ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో బీజేపీ శాసనసభా పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. కరెంటు, సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోతల సర్కారుగా మారిందన్నారు. ధర్నా సందర్భంగా కార్యకర్తలు కలెక్టరేట్‌లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు అరెస్టు చేశారు.
నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో బీజేపీ శాసనసభ పక్ష మాజీ నేత యెండెల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో బంగారు తెలంగాణ సాధించుకుందామని చెప్పిన కేసీఆర్, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసి తన కుటుం బాన్ని బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Advertisement
Advertisement