టార్గెట్‌కు సైకిల్
స్వతంత్రంగా ఎదిగేందుకు బీజేపీ వ్యూహం
మూడేళ్లలో జిల్లాలో పాగా వేసేందుకు యత్నం
జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీ కార్యకర్తల సమావేశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో తెలుగుదేశం పార్టీని టార్గెట్‌గా చేసుకుని బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు లేకుండా ఎదిగేందుకు సిద్ధమవుతున్నారు. కర్నూలు నగరంలో శనివారం నిర్వహించిన బీజేపీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశమే అందుకు తార్కాణం. జిల్లాలో టీడీపీని కాదని స్వతంత్ర శక్తిగా ఎదగాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దానికి ఇదే సరైన సమయమని కూడా అంచనా వేస్తోంది. పార్టీ అధిష్టానం సూచన మేరకే రాష్ట్ర నాయకత్వం జిల్లాల్లో కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తోంది.
నగరంలో శనివారం నిర్వహించిన జిల్లా సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశం నిర్వహణలోనూ, సక్సెస్ చేయడంలోనూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు, పాణ్యం, డోన్, బనగానపల్లి, కోడుమూరు నియోజకవర్గాల నుంచి తన అనుచరులను బస్సులు, లారీలు, ఇతర వాహనాల్లో తీసుకొచ్చారు.
జిల్లా చరిత్రలో ఇప్పటిదాకా బీజేపీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగిన దాఖలాల్లేవు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకోవటంతో పార్టీ రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆయా జిల్లాల్లో ముఖ్యమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో జిల్లాలో బీజేపీకి ఊతం దొరికిందని చెప్పొచ్చు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించటంతో నిరసనగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆ తరువాత టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పాణ్యం నుంచి పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. టీడీపీలో చేరకుండా ఉండేందుకు ఓ మాజీ మంత్రి అడ్డుపడ్డారని ప్రచారం కూడా జరిగింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయినాకాటసాని60 వేల పైచిలుకు ఓట్లు సంపాదించుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటంతో కాటసాని నేరుగా ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధిష్టానం సూచన మేరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా కర్నూలు, డోన్, పాణ్యం, బనగానపల్లి, కోడుమూరు నియోజకవర్గాల్లో ఉన్న కాటసాని వర్గీయులంతా ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు.
టీడీపీకి దీటుగా..
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రెండు ఎంపీ, 11 మంది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీ మూడు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. జిల్లాలో టీడీపీకి దీటుగా ఎదిగేందుకు కమలదళం చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న టీడీపీతో రాబోయే రోజుల్లో తమ్ముళ్లతో అవసరం లేకుండా చేసుకోవాలని కమలదళం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కాటసానిని టీడీపీలోకి రాకుండా అడ్డుకున్న వారిపైనా ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నారు. అందుకే టీడీపీకి చెందిన కార్యకర్తలు, బీజేపీ అభిమానులు, కార్యకర్తలను చేరదీస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. రానున్న కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేషన్‌ను చేజిక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.
శనివారం జరిగిన సమావేశంలో కాటసాని సూచనప్రాయంగా కర్నూలు కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పటం గమనార్హం. కాటసాని మదిలో ఉన్నది నిజమే అయితే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో టీడీపీతో జతకట్టేది లేదని కాటసాని వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. మూడేళ్లలో పార్టీని పటిష్టం చేసి జిల్లాలో టీడీపీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగాలన్నదే లక్ష్యమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఆ మేరకు కాటసాని నివాసంలో బీజేపీ ముఖ్య నాయకులంతా ప్రత్యేకంగా సమావేశం కావటం గమనార్హం.