
బోండా, గోరంట్లపై సభాహక్కుల నోటీస్
- అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత దూషణలతో ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, పాముల పుష్ప శ్రీవాణి, వి.కళావతి, కోటంరెడ్డిశ్రీధర్‌రెడ్డిలతో కలసి ఆమె శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ నోటీసును అందించారు.
అనంతరం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఈ నెల 18న పట్టిసీమపై చర్చ జరిగినప్పుడు మంత్రులతోసహా టీడీపీ సభ్యులు ఏవిధంగా అసభ్యకర పదజాలంతో మాట్లాడారో ప్రజలు చూశారని రోజా అన్నారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, మంత్రులు రావెల కిశోర్‌బాబు, దేవినేని ఉమా, కె.అచ్చెన్నాయుడు, పీతల సుజాత తదితరులు మాట్లాడిన మాటల క్లిప్పింగ్స్ చూస్తే ఏ ఒక్కరోజన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది, లేనిదీ బహిర్గతమవుతుందన్నారు.
తమను రెచ్చగొట్టేలా వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడారని, వాళ్లు పదిసార్లు మాట్లాడితే.. ఒకసారి మాట్లాడిన తమను టీవీల్లో చూపించడం దుర్మార్గమన్నారు. తనపై టీడీపీ ఎమ్మెల్యే అనిత ద్వారా గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభాహక్కుల నోటీస్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. హావభావాలను ప్రదర్శించడం బూతు అయితే.. సభలో స్పీకర్ సాక్షిగా ‘ఏంట్రా... అరేయ్ పాతేస్తా... నా కొ...’ అనడం తప్పుగా అనిపించకపోవడం బాధాకరమన్నారు.
టీడీఎల్పీ కార్యాలయంలో మీడియా ముందు ఎడిట్ చేసి ప్రదర్శించిన వీడియో ఫుటేజీ వ్యవహారానికి సంబంధించి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. స్పీకర్ కు సంబంధం లేకుండా ఎంపిక చేసిన క్లిప్పింగ్స్ మాత్రమే ఎలా బయటికొచ్చాయని ప్రశ్నించారు.