
రోజాపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం
వివరణకు అవకాశమివ్వాలని స్పీకర్‌కు రోజా వినతి
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అధికారపక్ష ఎమ్మెల్యే అనిత సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఇచ్చారు. గత డిసెంబర్‌లో అసెంబ్లీలో జరిగిన వ్యవహారంలో విపక్ష ఎమ్మెల్యే రోజా మహిళాలోకం సిగ్గుపడేలా ప్రవర్తించారని అనిత ఆరోపించారు. డిసెంబర్‌లో సభలో ఏం జరిగిందనే విషయాన్ని సీడీలో సమర్పిస్తున్నామని చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ.. ‘గతంలోనూ ఒకసారి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు.
ఇప్పుడు కూడా ఇస్తున్నారు. తీర్మానాన్ని అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తాం. కమిటీ విచారించి నివేదిక ఇస్తుంది’ అని చెప్పారు. దీనిపై రోజా స్పందిస్తూ తాను తప్పు చేయలేదని, తనపై ఆరోపణలు చేసినందున వివరణనిచ్చే అవకాశమివ్వాలని స్పీకర్‌కు విన్నవించారు. రోజా వినతికి స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. ప్రివిలేజ్ కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదని, దాని ముందు వాదన వినిపించాలని సూచించారు. రోజాకు మాట్లాడే అవకాశమివ్వకపోవడం పట్ల విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆమెకు మాట్లాడే అవకాశమివ్వకపోవడం అన్యాయమన్నారు.