బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు | Boston Consulting Group Report Over AP Capital Members Meets CM Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో ముగిసిన బీసీజీ ప్రతినిధుల భేటీ

Published Fri, Jan 3 2020 7:36 PM | Last Updated on Fri, Jan 3 2020 9:54 PM

Boston Consulting Group Report Over AP Capital Members Meets CM Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై నివేదిక సమర్పించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను బీసీజీ నివేదికలో ప్రస్తావించింది. అదే విధంగా అభివృద్ధి సూచీల వారీగా జిల్లాల పరిస్థితులను వివరించింది. ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు, వాటి ఆర్థిక పనితీరును నివేదికలో ప్రస్తావించింది. అవి అనుకున్న లక్ష్యాలను సాధించాయా లేదా అన్న అంశాలపై గణాంకాలతో సహా వివరించింది. (సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బీసీజీ)

అదే విధంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, టూరిజం, మత్స్యరంగాల్లో ప్రణాళికలను సైతం బీసీజీ తన నివేదికలో ప్రస్తావించింది. ప్రపంచంలోని వివిధ దేశాల బహుళ రాజధానులు, దేశంలోని వివిధ రాష్ట్రాల బహుళ రాజధానుల గురించి నివేదికలో పేర్కొంది. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించింది. రాష్ట్రం సత్వర ఆర్థికాభివృద్ధి, సత్వర ఫలితాల సాధనకై ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలో బీసీజీ తన నివేదికలో సూచించింది. కాగా రాజధాని అంశంపై జీఎన్‌ రావు కమిటీ రిపోర్టుపై మంత్రివర్గం చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించి, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది.(జీఎన్‌ రావు, బీసీజీ నివేదికల అధ్యయనానికి.. హైపవర్‌ కమిటీ)

ఆరు అంశాల ఆధారంగా బోస్టన్‌ నివేదిక
విజయవాడ: బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) ఆరు అంశాల ఆధారంగా నివేదిక సమర్పించిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. అభివృద్ధికి అడ్డంకులు ఏమున్నాయన్న దానిపై కమిటీ పరిశీలించిందని పేర్కొన్నారు. బీసీజీ నివేదికలో పేర్కొన్న అంశాల గురించి శుక్రవారం మీడియాకు వివరించారు. వివిధ దేశాల అభివృద్ధి ఆధారంగా ఏపీ అభివృద్ధికి సూచనలు చేశారని పేర్కొన్నారు.

ఆ వివరాలు..

  • ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2.2 లక్షల కోట్ల అప్పు ఉంది
  • రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించారు
  • రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి
  • కృష్ణా, గోదావరి బేసిన్‌లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి(వెస్ట్ గోదావరి, కృష్ణా) ఎక్కువగా ఉంది
  • ఎయిర్‌పోర్టు, పోర్టు విషయంలో విశాఖ తప్ప ఎక్కడా అంతగా అభివృద్ధి చెందలేదు
  • చేపల ఉత్పత్తి(60 శాతం) రెండు జిల్లాలోనే అధికంగా ఉంది
  • రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది
  • 8 జిల్లాల్లో ఇండస్ట్రియల్ ఏరియా తక్కువగా ఉంది
  • పర్యాటకంలో గత రెండేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు
  • కొన్ని కొన్ని మండలాలు నేషనల్ హైవే రావటానికి 4 ,5 గంటలు ప్రయాణం పడుతుంది 
  • ఉత్తరాంధ్ర  ప్రాంతంలో మెడికల్ హబ్ టూరిజం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, బోగపురం ఎయిర్‌పోర్టు, పసుపు, కాఫీ పంటలు, అరకు లోయలో ఎకో అడ్వెంచర్‌ టూరిజం అభివృద్ధి చేయాలి
  • గోదావరి డెల్టాలో పెట్రోకెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పోలవరం ప్రాజెక్టు, రోడ్‌ కనెక్టివిటీ, హార్టికల్చర్‌, కోనసీమ అభివృద్ధి చేయాలి
  • కృష్ణా డెల్టాలో సిరమిక్స్, ఫిషరీస్, ఎడ్యుకేషన్ హబ్, మచిలీపట్నం పోర్టు, హెల్త్‌ హబ్‌ అభివృద్ధి చేయాలి
  • దక్షిణ ఆంధ్ర.. ఆటోమొబైల్‌ మానిఫాక్చరింగ్‌ , లెదర్ అండ్ ఫిషరీస్, మై పాడు బీచ్‌, గోదావరి- పెన్నా లింకేజీ అభివృద్ధి చేయాలి
  • వెస్ట్ రాయలసీమలో టెక్ట్స్ టైల్స్‌, ఆటోపార్ట్స్‌, సేంద్రీయ ఉద్యావన సేద్యం, డ్రిప్‌ ఇరిగేషన్‌, గోదావరి పెన్నా అనుసంధానం, హైవే కనెక్టివిటీ
  • ఈస్ట్ రాయలసీమ ఎలక్ట్రానిక్స్‌ మానిఫాక్చరింగ్‌, స్టీలు ప్లాంట్లు, హైటెక్ అగ్రికల్చర్‌(టొమాటో ప్రాసెసింగ్‌), గండికోట, బేలం గుహల మధ్య ఎకో ఎడ్వంచర్‌ సర్క్యూట్‌
  • అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం(మాస్టర్‌ ప్లాన్‌) దాదాపు లక్ష కోట్ల రూపాయలు అవసరం(ఏపీసీఆర్‌డీఏ శ్వేతపత్రం- జూన్‌ 2019 ప్రకారం)
  • ఇందుకోసం ఏడాదికి దాదాపు 8 వేల నుంచి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది
  • కానీ రాష్ట్రం ఇప్పటికే 2.25 కోట్ల రూపాయల రుణాల్లో కూరుకుపోయి ఉంది
  • కేవలం ఒకే ఒక్క పట్టనానికి ఇంత ఖర్చు చేయడం రిస్కుతో కూడుకున్న పని
  • నిజానికి కొత్త పట్టణాల అభివృద్ధికి దాదాపు 30 నుంచి 60 ఏళ్ల సమయం పడుతుంది
  • చాలా వరకు గ్రీన్‌ఫీల్డ్‌ సిటీలు ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాయి
  • సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా పరిశీలించాం
  • అమరావతి ప్రాంతానికి వరదల ముప్పు ఎక్కువ(ఐఐటీ మద్రాస్‌, ఏపీ డిజాస్టర్‌ అథారిటీ వివరాల ప్రకారం)
  • జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాలు బహుళ రాజధానుల ద్వారా ప్రభుత్వ సంస్థలు, పౌరుల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి 
  • కర్నూలు, అమరావతి, విశాఖపట్నం రాజధానులుగా అనుకూలం
  • కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని మేలు అని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement