నిరర్ధక ఆస్తులుగా రెండు రాష్ట్రాలు | both states will become non performing assets, says y.harish chandra prasad | Sakshi
Sakshi News home page

నిరర్ధక ఆస్తులుగా రెండు రాష్ట్రాలు

Published Fri, Oct 25 2013 3:01 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

నిరర్ధక ఆస్తులుగా రెండు రాష్ట్రాలు - Sakshi

నిరర్ధక ఆస్తులుగా రెండు రాష్ట్రాలు

‘రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో సమస్యలు తలెత్తనున్నాయి. వాటిని గుర్తించి తగు పరిష్కారం చూపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో సమస్యలు తలెత్తనున్నాయి. వాటిని గుర్తించి తగు పరిష్కారం చూపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రెండు రాష్ట్రాలూ నిరర్థక ఆస్తులుగా మారే ప్రమాదముంది’ అని సీఐఐ ఏపీ శాఖ మాజీ చైర్మన్ వై.హరీశ్ చంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ‘రాష్ట్ర ఆర్థిక, రియల్ ఎస్టేట్ దృక్పథం’ అన్న అంశంపై గురువారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెసిడెంట్ సిహెచ్.కృష్ణాంజనేయులు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మందగమనం నుంచి బయటపడుతున్న సమయంలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయన్నారు. దాంతో అభివృద్ధి ఆరేడేళ్లు వెనక్కు వెళ్లిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు.

 

రాష్ట్రంలో వృద్ధి రేటు 5 శాతాన్ని మించడం ఇక గగనమేనని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ వదిలి తమ తమ నియోజకవర్గాల్లో కుటుంబసభ్యులతో కలిసుంటే సామాన్యుల కష్టాలు అర్థమవుతాయని హితవు పలికారు.
 
 అభివృద్ధిపై మాట్లాడాల్సిందే..
 
 ‘విభజనా? లేక సందిగ్ధమా?’ ఈ రెండే ఇప్పుడు తేలాల్సి ఉందని హరీశ్‌చంద్ర ప్రసాద్ అన్నారు. ‘విభజన అనంతర పరిణామాలపై మాట్లాడుతున్నందుకు నాపై ఒత్తిళ్లు వస్తున్నాయి. అయితే విభజన జరిగినా, జరక్కపోయినా అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిందే. తెలంగాణను కాదు, సీమాంధ్రనే దేశంలో 29వ రాష్ట్రంగా ప్రకటించాలి. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కోస్తా జిల్లాల్లో మిగులు భూములున్నాయి. ఇక నుంచి జరగాల్సిన అభివృద్ధి ఈ ప్రాంతాల్లోనే జరగాలి. అపార అవకాశాలున్న కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి (కేజీపీజీ) జిల్లాలను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దాలి. కొత్త రాష్ట్రం ఏర్పడితే పరిశ్రమలను స్థాపించాల్సిందిగా తొలి సీఎం ఆహ్వానించాలి. ఇక పరిపాలన కోసమే రాజధాని ఉండాలి. రాజ ధాని ఏర్పాటుకు వేలాది ఎకరాలు అవసరమే లేదు. ప్రతిపాదిత రాజధానికి 25 కిలోమీటర్ల పరిధిలో కంపెనీలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జరగకూడదు. ఆంధ్ర, రాయలసీమల్లోని మిగతా నగరాలన్నింటినీ సమానంగా అభివృద్ధి చేయాలి’ అని సూచించారు.
 
 ఇంకా ఖాళీ ఉంది..
 
 ‘భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. పరిస్థితులిలాగే కొనసాగితే అవి మనగలవా?’ అని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఈఏ) గౌరవాధ్యక్షుడు ఎమ్వీ కరుణాకరరావు ప్రశ్నించారు. గత మూడు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అనుమతులు పొందినప్పటికీ ఒక్క బిల్డర్ కూడా నిర్మాణ అనుమతి రుసుం చెల్లించలేదంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. 1.1 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్థలం ఇంకా ఖాళీగా ఉందని వెల్లడించారు. ‘రాష్ట్ర రుణ భారం రూ.1.80 లక్షల కోట్లుంది. ఈ పరిస్థితుల్లో విభజన జరిగితే ఇరు ప్రాంతాలూ తిరోగమన వృద్ధి చెందుతాయి’ అని ఎఫ్‌ఈఏ అధ్యక్షుడు లంకా దినకర్ ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల తోడ్పాటుతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ఏపీజేఎఫ్ గౌరవాధ్యక్షుడు కందుల రమేశ్ అన్నారు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, ఎఫ్‌ఈఏ ప్రతినిధులు జీఎల్‌ఎన్ ప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement