
వైఎస్సార్‌సీపీలో చేరిన బొత్స
మాజీ ఎంపీ ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సయ్య సహా పెద్దఎత్తున చేరిన అనుచరగణం
సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తన అనుచరగణంతో ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొత్సతోపాటుగా ఆయన సతీమణి ఝాన్సీ(మాజీ ఎంపీ), సోదరుడు అప్పల నర్సయ్య(మాజీ ఎమ్మెల్యే) తదితరులుసహా పెద్ద ఎత్తున నేతలు ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరారు.
భారీ సంఖ్యలో అనుచరులు వెంట రాగా పీసీసీ మాజీ చీఫ్ బొత్స ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్‌లోని జగన్ నివాసానికి చేరుకున్నారు. తనతోపాటుగా కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్న విజయనగరం జిల్లా ముఖ్య నేతలందర్నీ జగన్‌కు పరిచయం చేసి పార్టీ కండువాలు కప్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శులు ఎంవీ మైసూరారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, విజయనగ రం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి(ఎమ్మెల్సీ), మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, కె.పార్థసారథి, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, దాడిశెట్టి రాజా, బూడి ముత్యాలనాయుడు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కారుమూరు నాగేశ్వరరావుతో సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి, సాంబశివరాజులను జగన్ ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.
విజయనగరం కాంగ్రెస్ ఖాళీ...
బొత్స, ఆయన అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరికతో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. మాజీ ఎమ్మెల్యేలు బి.అప్పలనాయుడు, పి.సూర్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ ఎం.తులసి, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వీ రమణరాజు, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వై.రమణమూర్తి, మాజీ డీసీసీ అధ్యక్షుడు పి.విజయకుమార్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఉమామల్లేశ్వరరావు, అర్బన్ బ్యాంకు చైర్మన్ పువ్వాజ నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నేతలు ఎం.శ్రీనివాసరావు, మరో 62 మంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. జిల్లాలో ఒకటీ అరా నాయకులు మినహా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంతా వైఎస్సార్‌సీపీలో చేరారని బొత్స స్వయంగా వెల్లడించారు.