సాక్షి, విజయనగరం : నలభై ఏళ్ల క్రితం విజయనగరం జిల్లాగా ఏర్పడినప్పుడు ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాం కానీ మూడు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి అభివృద్దిపై దృష్టి సారించకపోవడం మన దురదృష్టమని ఆ జిల్లా నేత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విజయనగరం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు ఆనందపడ్డాం గానీ, తర్వాత వాటిని ఒక్క జీవోతో రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడంతో పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతోందని, దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ప్రజలకు అత్యవసరమని భావించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో శత పనుల శంఖుస్థాపన కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. పట్టణంలో 24 గంటల నీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఇసుక సమస్యను అధిగమించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. సోషల్ మీడియాలో రాతల గురించి ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అందరిళ్లల్లోనూ మహిళలు ఉంటారని వారిని కించపరుస్తూ మాట్లాడవద్దని హితవు పలికారు. పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలాడడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment