విశ్వాస ఘాతుకం !
విశ్వాస ఘాతుకం !
Published Wed, Dec 11 2013 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తమకు పదవులే పరమావధి అని దాని కోసం ప్రజలను ఎంతగా వీలైతే అంతగా వం చించగలమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబం మరో సారి నిరూపించింది. పార్లమెంట్‌లో సమైక్యాంధ్రకు అనుకూలంగా గళం విప్పుతాననిప్రకటించిన ఎంపీ బొత్స ఝాన్సీ కనీసం అవిశ్వాస నోటీసుపై సంతకం పెట్టలేదు. దీంతో ఆమె మరోసారి జిల్లా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు.
నోటి తో పలకరిస్తూ నొసటితో వెక్కిరిస్తున్నట్టుగా బొత్స కుటుంబ సభ్యులు వ్యవహరిస్తుండడంపై జిల్లా వాసు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా చీల్చిందన్న విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనకు మూలకారకుడని, ఆయన తన పదవుల కోసమే అధిష్టానానికి వత్తాసు పలుకుతున్నారని ప్రజలు గాఢంగా విశ్వసించారు. ప్రజల్లో రేకెత్తిన ఈ అనుమానాలు బలపడి, హింసాత్మకంగా మారి ఆయన ఆస్తులపై దాడులవరకూ దారితీసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఉద్యమిస్తున్న తరుణంలో ఎంపీ ఝాన్సీ వారికి తారసపడ్డారు.
సమైక్యాంధ్ర కోసం మీరు ఎందుకు రాజీనామా చేయడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అనాడు ప్రశ్నించగా, దీని కోసం తాను పార్లమెంట్‌లో గళం విప్పుతానని, జిల్లా వాసుల ఆందోళనను సభ దృష్టికి తీసుకువెళతానని చెప్పి ఆమె ఆ పూటకు వారి నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ తరువాత ఆమె ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పదవులను అనుభవిస్తున్నారు తప్ప ఏనాడూ సమైక్యా్రంధ గురించి మాట్లాడిన దాఖలాల్లేవు. గతంలో సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో సమైక్యాంధ్ర వాణి వినిపించి సస్పెండ్‌కాగా ఝాన్సీ మాత్రం వారికి దూరంగా ఉండి సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకొన్నారు. సమైక్యాంధ్రా ఉద్యమానికి మొదటి నుంచి దూరంగానే ఉం టున్న ఈమె పార్లమెంట్‌లోనూ.... ఉద్యమిస్తున్న సీమాంధ్రా ఎంపీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు తాజాగా కేంద్రం వైఖరిని నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చారు. ఈ మేరకు నోటీసుపై ఉండవల్లి, లగడపాటి, రాయపాటి, సాయిప్రతాప్, హర్షకుమార్, సబ్బం హరి వంటి పలువురు ఎంపీలు సంతకాలు చేశారు. అయినా ఈ జాబితాలోనూ ఝాన్సీ లేరు. ఎక్కడికక్కడ మాటలు మార్చి పబ్బం గడుపుకోవడమే తప్ప తమకు పదవులిచ్చి గౌరవించిన ప్రజల కోసం కాస్తయినా చేద్దామన్న బాధ్యతను విస్మరించడాన్ని జనం తీవ్రంగా పరిగణిస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలపై సంతకాలు చేయని సీమాంధ్రా ఎంపీలను బహిష్కరించాల్సిందిగా ఇప్పటికే ఏపీఎన్‌జీవోలు పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి అవకాశవాద నాయకులకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
Advertisement