
సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి
♦ మంత్రి పదవికోసం పార్టీ మారడానికి సిగ్గు లేదా?
♦ నీతిమంతులమని చెప్పుకునేవారి బండారం త్వరలోనే బయటపెడతా
♦ కేంద్రమంత్రిగా ఉండి ఏం అభివృద్ధి వెలగబెట్టారు?
♦ కోటచుట్టూ మొక్కలు నాటించడమే అభివృద్ధా?
♦ మంత్రి పదవులు కేవలం ఆస్తులు కాపాడుకోవడానికేనా?
♦ అశోక్, సుజయ్‌పై వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ఫైర్
♦ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయం: భూమన
♦ విజయవంతమైన విజయనగరం వైఎస్సార్‌సీపీ ప్లీనరీ
విజయనగరం మున్సిపాలిటీ: నిజమైన రాజరిక వంశీయుడివై.. తాండ్రపాపారాయుని వంశంలో పుట్టి ఉండి... సిగ్గు... పౌరుషం ఉంటే తక్షణమే ఏ పార్టీ జెండాతో ఎమ్మెల్యేగా గెలిచారో... ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి సుజయ్‌కు సవాల్ విసిరారు. విజయనగరం పట్టణంలోని జగన్నాథ కల్యాణ మండపం ఆవరణలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అధ్యక్షతన శనివారం జరిగిన పార్టీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
తొలుత పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాస్, ఇతర నాయకులు కోలగట్ల, పెనుమత్సతో కలసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ జిల్లాలోని ఇద్దరు మహారాజులకు మంత్రి పదవులిస్తే వారి ఆస్తులు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని మండిపడ్డారు. వారికి రైతు, సామాన్య కుటుంబాలవారి కష్టాలు, ఇబ్బందులు వారికి పట్టవన్నారు.
నీతి మంతులమని చెప్పుకుంటున్న వారి దొంగపనులను, దోపిడీ వ్యవహారాలను వెలుగులోకి తెస్తామని చెప్పారు. తాను దొడ్డిదారిలో వస్తున్నానని ప్రచారం చేస్తున్న మంత్రి సుజయ్ చేసిందేంటని ప్రశ్నించారు. అధి కారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోనే తాను చేరితే...ఒక పార్టీ గుర్తుపై గెలిచి అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని అనుభవించటాన్ని ఏమంటారని ప్రశ్నించారు.
ఇదేం రాజనీతి?
జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తాననని చెప్పి... మాన్సాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు పావులు కదిపి... చివరికి మెడికల్ కళాశాల రాకుండా చేయడమేనా రాజనీతి అని అశోక్‌గజపతిరాజుపై బొత్స ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా ఇప్పటివరకూ జిల్లాకు చేసింది ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే సొంత కోట చుట్టూ, పెద్ద చెరువు చుట్టూ మొక్కలు నాటించటమేనా అని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల అనంతరం తాను జిల్లా వదిలి పోరిపోయానని ప్రచారం చేస్తున్నారని, అయితే ప్రజల తీర్పుకు అనుగుణంగా వారేం అభివృద్ధి చేస్తారో చూసేందుకే ఇన్నాళ్లూ వేచి చూశానని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో రహదారుల విస్తరణను అడ్డుకున్నదీ, చెల్లూరు వద్ద కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నదీ ఎవరో జనానికి తెలుసన్నారు. గతంలో తానే మద్యం సిండికేట్‌ను నడుపుతున్నట్లు ప్రచారం చేసిన కేంద్రమంత్రి తన కారులో పక్కనే కూర్చుంటున్న వారితో పాటు ఇతర తొత్తులు చేస్తున్నది ఏంటో తెలుసుకోవాలన్నారు. కావాలంటే వారి పేర్లను పంపిస్తామని చెప్పారు. ప్రతిసారీ తనపై ఆరోపణలు చేస్తున్న ఇద్దరు మంత్రులు తన అవినీతి, అక్రమాలను నిరూపించగలిగితే శాశ్వతంగా రాజ కీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
ఎవరెన్ని రాజకీయాలు చేసినా అందరి దృష్టి 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయంపైనే ఉండాలని, జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ గెలిస్తే వైఎస్సార్ హయాంలో కడప మాదిరి విజయనగరం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములునాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు, డీసీసీబీ ఛైర్‌పర్సన్ మరిశర్ల తులసి, వైస్ చైర్‌పర్సన్ చనుమళ్ల వెంకటరమణ, ఎస్‌కోట నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నాయుడుబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రొంగలి జగన్నాథం, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, పిళ్లా విజయ్‌కుమార్, ఎ.కె.వి.జోగినాయుడు, అలజంగి జోగారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శులు అవనాపు విజయ్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, జి.వి.రంగారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మ, యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎం.ఎల్.ఎన్.రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షుడు షకీల్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఎం.సన్యాసినాయుడు, ప్రచార విభాగం అధ్యక్షుడు ఎం.కృష్ణమోహన్, గర్భాపు ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై తీర్మానాలు: జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన
వైఎస్సార్‌సీపీ ఆదేశాల మేరకు జిల్లాలో 9 నియోజకవర్గాలో ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఆ సమావేశాల్లో స్థానిక సమస్యలపై చేసిన తీర్మానాలతో పాటు జిల్లా సమావేశంలో చేసిన 9 తీర్మానాలను వచ్చే నెల 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర ప్లీనరీలో ప్రవేశపెడతామన్నారు. అధికార పార్టీ చేపడుతున్న అక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై ఆలుపెరగని పోరాటం చేసేందుకు జగన్ సారధ్యంతో ముందుకు దూసుకువెళతామన్నారు.
డబ్బులిచ్చి మంత్రి పదవి కొన్నారు: మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి
జిల్లాలో ఇటీవల దొడ్డిదారిన మంత్రి ఆయన సుజయ్ ఆ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్‌కు డబ్బులిచ్చి కొనుక్కున్నారని మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు అన్నారు. ప్రజా సమస్యలు పట్టని మంత్రి కోటను ముట్టడించాలని పిలుపునిచ్చారు. టీడీపీలో దమ్మున్న నాయకుడు లేకే కొత్తగా పార్టీలో చేరినవారికి మంత్రి పదవి ఇచ్చారని దుయ్యబట్టారు.
ప్రజా నాయకుడు జగన్: పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమన
ప్రజల కన్నీళ్లు, కష్టాలు తీరాలంటే... అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఒక్కటే మార్గమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మరల రాజన్న రాజ్యం జగన్‌మోహన్‌రెడ్డితో సాధ్యపడుతుందన్నారు.
విజయమే లక్ష్యం కావాలి: జిల్లా ఇన్‌చార్జి ధర్మాన కృష్ణదాస్
గ్రామాల్లో, పట్టణాల్లో తటస్థంగా ఉండే ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించేలా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, జిల్లా ఇన్‌చార్జి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలంటే ప్రతి ఓటరూ ముఖ్యమేనన్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి... ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు.