
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రాధాన్యతలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన మున్సిపల్ కమిషనర్ల వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అలసత్వం వహించొద్దని స్పష్టం చేశారు. నవరత్నాల అమలుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఇందుకు సహకరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఎవరిమీద కక్ష సాధించే ఉద్దేశం తమకు లేదన్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా గ్రామ, వార్డు వలంటీర్లు, అర్బన్ సెక్రటేరియట్ వ్యవస్థలను పటిష్టంగా అమలు పరిచేందుకు డ్రాఫ్ట్‌నోట్ తయారు చేస్తున్నామని చెప్పారు.
ఇందుకోసం అధికారుల సూచనలు స్వీకరించడానికి ఈ వర్క్‌షాపును ఏర్పాటు చేశామని తెలిపారు. జోనల్ స్థాయిలోనూ వర్క్‌షాపులను ఏర్పాటు చేసి ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకుంటామని పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి డెప్యుటేషన్‌పై వచ్చి మున్సిపల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు కొందరు కమిషనర్ కంటే తమ హోదా పెద్దదని భావించి సహకరించడం లేదనే విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై మంత్రి తీవ్రంగా స్పందిస్తూ.. అలాంటి అధికారులు మున్సిపాల్టీల్లో పనిచేయాల్సిన అవసరం లేదని, బదిలీపై వెళ్లిపోవచ్చన్నారు. మున్సిపల్ డైరెక్టర్ విజయకుమార్ ప్రసంగిస్తూ.. రేపు ప్రజలకు ఏం కావాలో ముందుగానే ఆలోచించి అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రేటర్ విశాఖ కమిషనర్ సృజన, రాజమహేంద్రవరం కమిషనర్ సుమిత్‌కుమార్, కాకినాడ కమిషనర్ రమేష్, అనంతపురం ఆర్‌జేడీ రవి తదితరులు వివిధ అంశాలపై ప్రజంటేషన్ చేశారు.
త్వరలో మున్సిపల్ ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికలను సాధ్యమైంత త్వరగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మంగళవారం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 90 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం మంగళవారంతో ముగిసిందని, వీటికి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 85 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లలో కులాలవారీగా ఓటర్ల గణన పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన మున్సిపాల్టీల్లో విలీన గ్రామాల సమస్యలు, న్యాయపరంగా కేసులు కొనసాగుతున్నాయని, వీటిని కూడా పరిష్కరించి ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు ఉన్న ప్రాంతాల్లో వంద కుటుంబాలకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా అర్బన్ సెక్రటేరియట్ వ్యవస్థను కూడా అమలులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment