రైతన్నకు నిండు భరోసా | Botsa Satyanarayana Presents AP Agriculture Budget 2019 | Sakshi
Sakshi News home page

రైతన్నకు నిండు భరోసా

Published Sat, Jul 13 2019 4:23 AM | Last Updated on Sat, Jul 13 2019 11:13 AM

Botsa Satyanarayana Presents AP Agriculture Budget 2019 - Sakshi

శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

రైతుకు పంట ప్రాణం. పంటకు వాతావరణం ప్రాణం. ఆ పంట రాకపోతే రైతు తట్టుకోలేడు. వాతావరణం సరిగా లేకపోతే పంట తట్టుకోలేదు. అంటే పంటకు బీమా కావాలి. బీమాతోనే రైతుకు ధీమా వస్తుంది.

సాక్షి, అమరావతి:  వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తన తొలి వ్యవసాయ బడ్జెట్‌లో– నవరత్నాలలో భాగంగా ప్రకటించిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా’కు పెద్దపీట వేసింది. మొత్తం వ్యవసాయ బడ్జెట్‌లో శుక్రవారం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. 2019–20 సంవత్సరానికి వ్యవసాయం, అనుబంధ రంగాలకు మొత్తం రూ.28,866.23 కోట్లు ప్రతిపాదించగా, అందులో దాదాపు మూడో వంతు రూ.8,750 కోట్లను రైతుకు పెట్టుబడి సాయం కోసం కేటాయించారు. ఈ పథకంతో 15.37 లక్షల మంది కౌలు రైతులు సహా మొత్తం 70 లక్షల మంది అన్నదాతలు లబ్ధి పొందనున్నారు. రైతు బాంధవుడిగా ఖ్యాతిగాంచిన వైఎస్సార్‌ స్ఫూర్తి్తతో తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అంకితమవుతున్నట్టు బొత్స ప్రకటించారు.



జాతీయ ఆహార భద్రతా మిషన్‌కు రూ.141.26 కోట్లు 
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఏపీలోనే రూ.2,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి, రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించేలా జాతీయ ఆహార భద్రతా మిషన్‌కు బడ్జెట్‌లో రూ.141.26 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.341 కోట్లు ప్రతిపాదించారు. రైతులకు రాయితీ విత్తనాల సరఫరాకు రూ.200 కోటు, భూసార, భూ విశ్లేషణ పరీక్షల కోసం రూ.30.43 కోట్లు, సూక్ష్మ ధాతు లోపమున్న పొలాలకు జింకు, జిప్సం, బోరాన్‌ వంటి పోషకాలను 100% రాయితీపై పంపిణీ చేసేందుకు మరో రూ.30.05 కోట్లు, యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి రూ.460.05 కోట్లు ప్రతిపాదించారు. వర్షాధారిత ప్రాంతాల్లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ను అమలు చేస్తామని మంత్రి అన్నారు. ప్రకృతి సాగుకు ‘పరంపరాగత కృషి వికాస్‌ యోజన’ కింద రూ.91.31 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2019–20లో రైతుల సంక్షేమం, వ్యవసాయ విభాగం అభివృద్ధికి రెవెన్యూ పద్దు కింద రూ.12,280.14 కోట్లు, క్యాపిటల్‌ వ్యయ పద్దు కింద రూ.230.28 కోట్లు ప్రతిపాదించారు.



మూడు విశ్వవిద్యాలయాలకు... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల పరిధిలో ఉన్న 3 విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.630.60 కోట్లను ప్రతిపాదించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నాబార్డ్‌–ఆర్‌ఐడీఎఫ్‌ నిధులు రూ.60 కోట్లతో కలిపి మొత్తం రూ.415 కోట్లు, ఉద్యాన వర్సిటీకి రూ.98.60 కోట్లు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.117 కోట్లు ప్రతిపాదించారు.
 
వివిధ శాఖలకు కేటాయింపులు  
వ్యవసాయంతో పాటు ఉద్యాన రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అధిక ఉత్పాదకత కలిగిన పసుపు వంగడాలను రైతులకు 50 శాతం రాయితీపై అందజేయనుంది. ఉద్యాన శాఖకు 2019–20లో రెవెన్యూ పద్దు కింద మొత్తం రూ.1,532 కోట్లను ప్రతిపాదించగా, అందులో బిందు, తుంపర సేద్య పరికరాల సరఫరాకు రూ.1,105.66 కోట్లు, పామాయిల్‌ రైతులకు ధరలో వ్యత్యాసం నివారించేందుకు అదనంగా రూ.80 కోట్లు ఉన్నాయి. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం, అరటి ప్రొసెసింగ్‌ యూనిట్‌ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టు పరిశ్రమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు 90% రాయితీని ప్రకటించింది.

బైవోల్టిన్‌ పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రైతులకు కేజీ పట్టుగూళ్లకు రూ.50, డీలర్లకు బైవోల్టిన్‌ పట్టుదారం ఉత్పత్తిపై కేజీకి రూ.130 ప్రోత్సాహకం ఇవ్వనుంది. పట్టు పరిశ్రమ శాఖకు రెవెన్యూ పద్దు కింద రూ.158.46 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,240.93 కోట్లు, మత్స్యశాఖకు రూ.550.86 కోట్లు, మార్కెటింగ్‌ శాఖకు రూ.3,214.34 కోట్లు, సహకార రంగానికి రూ.234.64 కోట్లు, ఉచిత విద్యుత్‌ సరఫరాకు రూ.4,525 కోట్లు, ఆక్వా రంగంలో విద్యుత్‌ చార్జీల రాయితీకి రూ.475 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలు ఉపాధి హామీ పథకంతో అనుసంధానానికి రూ.3,626 కోట్లు ప్రతిపాదించారు. 2019–20లో సుమారు 50,000 సోలార్‌ పంపు సెట్ల ఏర్పాటుకు ప్రణాళిక ఖరారు చేసినట్టు బొత్స తెలిపారు.

వ్యవసాయ బడ్జెట్‌లో కీలకాంశాలు.. 

  • రైతులందరికీ వడ్డీ లేని రుణాలు
  • ధరల స్థిరీకరణ నిధి రూ. 3,000 కోట్లు 
  • ప్రకృతి విపత్తుల నిధి రూ. 2,000 కోట్లు 
  • రైతులు మరణిస్తే రూ. 7 లక్షల చొప్పున ఆర్థిక సాయం
  • రైతు సమస్యల పరిష్కార వేదికగా అగ్రీ మిషన్‌
  • పట్టు పరిశ్రమ శాఖ రూ.158.46 కోట్లు 
  • పశు సంవర్థక శాఖ 1240.93 కోట్లు
  • పౌల్ట్రీ రైతుల రుణాలపై వడ్డీ రాయితీ 
  • మత్స్య శాఖ రూ.550.86 కోట్లు
  • సహకార రంగం రూ.234.64 కోట్లు
  • ఆక్వా రంగంలో విద్యుత్‌ చార్జీల రాయితీ రూ.475 కోట్లు
  • ఉపాధి హామీతో వ్యవసాయ, అనుబంధ రంగాలు అనుసంధానానికి రూ.3626 కోట్లు 
  • వైఎస్సార్‌ – పీఎం ఫసల్‌ బీమా యోజన రూ.1,163 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ రూ.460.05 కోట్లు
  • వడ్డీ లేని రుణాలు రూ.100 కోట్లు
  • వైఎస్సార్‌ రైతు బీమా రూ.100 కోట్లు 
  • రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.341 కోట్లు
  • రాయితీ విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు
  • రాష్ట్రంలో ఏర్పాటయ్యే కేంద్ర పరిశోధనా సంస్థలకు చేయూత
  • పులివెందులలో అరటి పరిశోధన, ప్రాసెసింగ్‌ యూనిట్‌ 
  • సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 బోనస్‌
  • పశువులు చనిపోతే పరిహారం
  • పశువుల మందుల సరఫరాకు రూ.75.35 కోట్లు
  • వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఉచిత బోర్లు రూ. 200 కోట్లు
  • వేర్‌హౌసింగ్‌ మౌలిక వసతుల నిధి రూ. 200 కోట్లు
  • వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ రూ. 109 కోట్లు
  • రైతులకు ఎక్స్‌గ్రేషియో రూ. 100 కోట్లు
  • సహకార రంగంలో డెయిరీ పటిష్టత రూ. 100 కోట్లు
  • పశుగ్రాసం, దాణా రూ. 100 కోట్లు
  • గోదాముల నిర్మాణం రూ. 37.54 కోట్లు
  • చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు సాయం రూ. 100 కోట్లు
  • చేపల వేట విరామ సమయంలో  ఇచ్చే సాయం రూ.10 వేలు 
  • జాలర్లకు ఇచ్చే ఆయిల్‌ సబ్సిడీ లీటర్‌కు రూ.12.96కు పెంపు
  • ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణిస్తే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంపు 
  • మత్స్యకారుల బోట్లకు డీజిల్‌ సబ్సిడీ రూ.100 కోట్లు
  • మత్స్య సంపద అభివృద్ధికి రూ.60 కోట్లు
  • ఎస్సీ మత్స్యకారుల సంక్షేమం, సహాయం రూ.50 కోట్లు
  • ఫిషింగ్‌ హార్బర్లు, ల్యాండింగ్‌ సెంటర్ల  నిర్మాణానికి రూ.100 కోట్లు  

అన్నదాతలకు ధీమా

సాక్షి, అమరావతి: రుణమాఫీ మాదిరి మోసం లేదు.. ‘అన్నదాతా సుఖీభవ’ పథకంలా ఓట్ల కనికట్టు లేదు. లెక్కకు మిక్కిలి హామీలిచ్చి అమలు చేయలేక చతికిలబడిన దుస్థితి లేదు. ఉన్నది ఉన్నట్టు.. ఉండదు కనికట్టు అన్నట్టుగా సాగింది 2019–20 రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌. ‘నేను విన్నాను. నేను ఉన్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పలికిన మాటలు వ్యవసాయ బడ్జెట్‌లో ప్రతిబింబించాయి. నిజానికి మొదట్లో ప్రకటించిన విధంగా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50 వేల పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి ప్రారంభించాల్సి ఉంది. కానీ.. రైతుల కష్టాలను స్వయంగా చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వచ్చే అక్టోబర్‌లో ప్రారంభమయ్యే రబీ నుంచే ఇస్తానని ప్రకటించారు. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్‌లోనే రూ.8,750 కోట్లను కేటాయించారు. దీనివల్ల సుమారు 64.07 లక్షల మంది రైతులకు మేలు కలుగుతుంది.
 
గత ఏడాది కన్నా రూ.9,796 కోట్లు ఎక్కువ
‘వ్యవసాయం దండగ.. టూరిజమే పండగ’ అని చెప్పే చంద్రబాబు గత ఏడాది (2018–19) బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన నిధులు 19,070 కోట్లు. ఈ మొత్తంలో నాలుగైదు విడతల రుణమాఫీకి నయాపైసా కేటాయించకపోవడం రైతులపై గత ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. దీనికి భిన్నంగా 2019–20 వ్యవసాయ బడ్జెట్‌లో వైఎస్సార్‌ రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ఏకంగా రూ.8,750 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన రైతు రథం పథకం (ట్రాక్టర్ల కొనుగోలు పథకం) ఎంతగా దుర్వినియోగమైందో అందరికీ తెలిసిందే. అందుకే ప్రస్తుత ప్రభుత్వం యాంత్రీకరణకు పెద్ద పీట వేస్తూనే కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు గ్రూపులకు పరికరాలను అందజేయాలని నిర్ణయించింది. 

పైసా ఖర్చు లేకుండా రైతులకు బీమా పరిహారం
పంటల బీమాలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఓ మైలురాయి కాగా.. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయడం బహుశా దేశంలోనే మొదటిసారి. ‘మా మానిఫెస్టోనే ఒక భగవద్గీత.. ఒక బైబిల్‌.. ఒక ఖురాన్‌’గా భావించామనే దానికి వాస్తవ రూపమే ఈ పథకానికి రూ.1,163 కోట్ల కేటాయింపు. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీలన్నీ రాష్ట్రంలోని 15.37 లక్షల మంది కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవడం గమనార్హం. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని గత ముఖ్యమంత్రి మాట తప్పగా.. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ రూ.3 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారిగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేశారు.

కల్తీ విత్తనాల కట్టడికి చర్యలు
గత ప్రభుత్వ హయాంలో కల్తీ విత్తనాలతో అనేక మంది మిర్చి రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. తన ప్రభుత్వంలో ఆ మాటే వినబడకూడదన్న వైఎస్‌ జగన్‌ సంకల్పాన్ని సాకారం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో సమగ్ర పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో వ్యవసాయంపై రూ.81,554 కోట్లు ఖర్చు పెడితే జగన్‌ ఈ ఒక్క ఏడాదిలోనే రూ.28,866.23 కోట్లు ప్రతిపాదించారు. 2014–15లో రూ.13,110.39 కోట్లుగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రకటిస్తే అందులో అచ్చంగా వ్యవసాయానికి మిగిలింది రూ.4 వేల కోట్లకు మించకపోవడం గమనార్హం. ఇక, 2015–16లో రూ.14,184 కోట్లను ప్రకటించినా అందులో రూ.5 వేల కోట్లు రుణమాఫీకి సర్దుబాటు చేసి సాగుకు నామమాత్రపు నిధులే మిగిల్చారు. 2016–17లో రూ.16,251 కోట్లు, 2017–18లో రూ.18,214 కోట్లు, 2018–19లో రూ.19,070.36 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయానికి కేటాయించినా ఇవేవీ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా నడపలేకపోయాయి. చివరకు దురదృష్టవశాత్తు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ప్రకటించిన రూ.5 లక్షల సాయాన్ని కూడా ఇవ్వలేదు. ఇటువంటి దుర్భర పరిస్థితులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉంటే వ్యవసాయ రంగం రాష్ట్రంలో 11 శాతం వృద్ధి సాధించిందని చెప్పుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement