దిగ్విజయ్ ఆదేశాలిచ్చినా తాత్సారం
షోకాజ్ చూశాక వైఖరి చెబుతా: జేసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీసుల జారీ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోర్టులోకి చేరింది. సీమాంధ్రలో కాంగ్రెస్ చచ్చిపోయిందని, పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలగాలంటూ జేసీ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏఐసీసీ సభ్యుడైన జేసీకి పీసీసీ షోకాజ్ నోటీసులు జారీచేసే అధికారం లేకపోవడంతో ఆ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు.
దీంతో జేసీకి నోటీసులు జారీ చేయాలని పీసీసీకి ఆదేశాలిచ్చామని దిగ్విజయ్ ఈనెల 12న మీడియాకు చెప్పారు. అనంతరం ఏఐసీసీ లేఖను క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ రాజుకు పంపుతూ జేసీకి నోటీసులు జారీచేయాలంటూ పీసీసీ సూచించింది. పీసీసీకి ఏఐసీసీ సూచించింది కాబట్టి పీసీసీ అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘం తిరిగి బొత్సకు లేఖ రాసింది. మరోపక్క తనపై పీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూశాక వైఖరేమిటో చెబుతానని జేసీ మంగళవారం మీడియాకు తెలిపారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, బొత్స మాత్రం బయటకు పొమ్మంటున్నారని అన్నారు.