నన్ను బహిష్కరించడానికి బొత్స ఎవరు?: జేసీ
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటున్నానని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తనపై చర్యలు తీసుకోవాలని బొత్స ఏఐసీసీకి లేఖ రాయటం సంతోషకరమని ఆయన బుధవారమిక్కడ పేర్కొన్నారు. వాస్తవాలు మాట్లాడుతుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని జేసీ అన్నారు. తనను కాంగ్రెస్ నుంచి బహిష్కరించడానికి బొత్స ఎవరిని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేనేలేదని జేసీ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, కేంద్రంలోని మంత్రులు, ఎంపీలను సస్పెండ్ చేసిన తరువాతే తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభజనకు దారితీసిన పరిస్థితులను వివరించి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జేసీ అభిప్రాయపడ్డారు.