రాజ్యసభ బరిలో జేసీ!
నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేల సంతకాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను స్వయంగా పోటీ చేయలేకపోతే మరో అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రాజ్యసభ నామినేషన్ పత్రాలపై పది మంది ఎమ్మెల్యేల సంతకాలను కూడా సేకరించారు.
వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీకి చెందినవారు. మిగిలిన వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బుధవారం అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో మాజీ పీఆర్పీ నేతలైన ఎమ్మెల్యేలతో జేసీ సమావేశమై, ఈ ప్రతిపాదన చేశారు. పీఆర్పీకి చెందిన ఎమ్మెల్యేలు ఎలమంచిలి రవి, వంగా గీత, పంతం గాంధీమోహన్, బండారు సత్యానందరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉగ్ర నర్సింహారెడ్డి, రాజా అశోక్‌బాబులతో పాటు మరో ఐదుగురు జేసీ తెచ్చిన నామినేషన్ పత్రంపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తగిన రీతిలో నిరసన తెలియచేసేందుకే ఈ సంతకాలు చేశామని, జేసీకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయనకే ఓటు వేస్తామని ఎలమంచిలి రవి తెలిపారు. అంతకుముందు జేసీ దివాకర్‌రెడ్డి ఎంఐఎం నేతలతో కూడా సమావేశమై తనకు మద్దతివ్వాలని కోరారు.