
రాజ్యసభకు పోటీ చేస్తా: జేసీ
రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేస్తున్నట్లు మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేస్తున్నట్లు మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమేరకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తనకు సహకరించాలని గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటష్తో పాటు ఇతర నేతలను కోరినట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. రాజ్యసభకు గంటా పోటీ చేస్తారో లేదో తనకు తెలియదన్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి రాజ్యసభకు స్వతంత్ర్యంగా పోటీ చేసేందుకు జేసీ అడుగులు వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కాగా అధిష్ఠానం నుంచి అభ్యర్థుల జాబితా రాకముందే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికివారుగా రాజ్యసభ అభ్యర్థిత్వానికి సంతకాల సేకరణ చేపట్టడంపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్ తరపున ఒక్కరే పోటీలో ఉంటారని అన్నారు. చిరంజీవితో సంప్రదించాకే పోటీపై నిర్ణయం ఉంటుందన్నారు. తమలో ఒకరిని మాత్రమే బరిలో దింపే యోచనలో ఉన్నట్లు గంటా తెలిపారు.