కుమారుడితో తల్లిదండ్రులు,నిలబడలేని స్థితిలో ఉన్న వెంకటసుబ్బయ్య
అసలే నిరుపేదలు.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది... అలాంటి వారికి పెద్ద కష్టం వచ్చింది... తమ కుమారుడికి 13 ఏళ్లు వచ్చినా పసివాడిలాగే ఉన్నాడు.. ఎదుగుదల లేదు.. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు... ఆస్పత్రుల్లో చూపించుకోవడానికి అంతో ఇంతో ఉన్న డబ్బును అయిపోగొట్టుకున్నారు... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
బద్వేలు (అట్లూరు) :బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని రిక్షా కాలనీలో నివాసం ఉంటున్న దాసరి ఆదిలక్ష్మి, వెంకటసుబ్బయ్యకు ఉండటానికి ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మొదటి కుమారుడు పేరు వెంకటసుబ్బయ్య. ఆ పిల్లోడు పుట్టగానే మొదట కుమారుడని పుట్టాడని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అయితే వారి ఆనందం ఎక్కువ కాలం నిలవ లేదు. ఆ బాలుడు పుట్టుకతో బాగా ఉన్నప్పటికీ..
రాను రాను ఎదుగుదల లేదు. అలాగే మాటలు రాకపోవడంతోపాటు కాళ్లు సన్నగిల్లి పోతున్నాయి. ఆకలి వేస్తుందనే విషయం కూడా సైగల ద్వారా చెప్పడం లేదు. వారి ఆర్థిక స్థోమతను బట్టి సాధారణ ఆస్పత్రుల్లో చూపించారు. ఫలితం లేకపోయింది. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి అని వైద్యులు తెలిపారు. పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపిస్తే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోపూట గడవని స్థితిలో ఉన్న వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
పింఛన్ ఇప్పించండి మహాప్రభో
కనీసం కదలలేని, మెదలలేని స్థితిలో ఉన్న తమ కుమారుడికి పింఛన్ ఇవ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని విన్నవించడానికి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తహసీల్దార్‌ను కలవడానికి వారు వచ్చారు. తమ పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం చేయాలని కోరారు.
దాతలు స్పందించండి
పిల్లవాడిని ఇంట్లో వదిలి కూలీ పనులకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక వారు సతమతమవుతున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక, ఇంటి అద్దె కట్టుకోవడం కూడా కష్టమైంది. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే తమ కుమారుడి ఆరోగ్యం బాగు చేయించుకుంటామని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment