కంచిలి: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘జన్మభూమి-మా ఊరు’ గ్రామ సభలను బహిష్కరించనున్నట్టు కంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు ఇప్పిలి లోలాక్షి చెప్పారు. ఆమె బుధవారం మధ్యాహ్నం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలో కొత్త రేషన్ కార్డుల ఎంపిక ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. కొన్ని నెలలుగా ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రెవెన్యూ యంత్రాంగం అర్హులైన లబ్ధిదారుల జాబితాను అనర్హులుగా పేర్కొంటూ జాబితాను రూపొందించారని తెలిపారు. జన్మభూమి కమిటీలు వారికి నచ్చిన వారికే కార్డులు కేటాయించారని అలాంటప్పుడు అధికార యంత్రాంగం పాత్ర ఏమిటని ప్రశ్నించారు.
ఎన్నో నెలలుగా అధికార యంత్రాంగం కసరత్తుపడి తయారు చేసిన జాబితాకి అర్ధం లేకుండా పోయిందని వాపోయారు. మండలంలో అర్హులైన 348 మందికి కొత్తరేషన్ కార్డులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీవారు అడ్డుకున్నారని, ఆ జాబితాను కూడా జిల్లా ఉన్నతాధికారులకు పంపించామని చెప్పారు. ఈ విషయమై ఈ నెల 16వ తేదీన జిల్లా, మండల స్థాయి అధికార యంత్రాంగానికి లేఖలు రాయడంతోపాటు తమ పరిస్థితిని పత్రికల ద్వారా వెల్లడించామని తెలిపారు.
ఒక మహిళా ఎంపీపీని అయిన తాను ప్రజల కోసం నిరసన దీక్ష చేశానని, ఇంకా అన్యాయం చేస్తున్నారని, చివరి వరకు పోరాట పటిమతో ముందుకెళతానని, విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల తాను నిరసన దీక్ష చేసినప్పుడు, టెక్కలి ఆర్డీఓ వచ్చి కొత్తరేషన్‌కార్డులను పూర్తిగా పారదర్శకంగా చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ, అవేవీ దిగువస్థాయిలో అమలుకాలేదన్నారు. ఏకపక్షంగా కొత్తరేషన్ కార్డుల ఎంపిక జరిగినందుకు నిరసనగా తాను ఈ జన్మభూమి కార్యక్రమ గ్రామసభలను బహిష్కరిస్తున్నానని తెలిపారు.
జన్మభూమిని బహిష్కరిస్తా..!
Published Thu, Dec 31 2015 12:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement