జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని జిల్లా కలెక్టర్
టెన్త్ విద్యార్థులకు అల్పాహారం
Published Tue, Dec 17 2013 4:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. సురేశ్‌కుమార్ జిల్లా పరిషత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జెడ్పీ నుంచి నిధులు విడుదల చేస్తూ ఆయన సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఒక్కో విద్యార్థికి రూ.6 చొప్పున కేటాయించారు.
గతేడాది వరకూ ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్ల విద్యార్థులకే అల్పాహారం అందించేవారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఎయిడెడ్ హైస్కూల్ విద్యార్థులకూ జెడ్పీ నిధులతోనే పౌష్టికాహారం అందించేందుకు నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ఆయా యాజమాన్యాల్లో పదో తరగతి చదువుతున్న 25 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నిధులతో విద్యార్థులకు ఉప్మా, ఇడ్లీ, గుడ్లు, బిస్కెట్లను రోజు మార్చి, రోజు అల్పాహారంగా అందించాల్సి ఉంది. 25 వేల మందికి రూ.6 వంతున అల్పాహారం అందించేందుకు నెలకు రూ.45 లక్షల వ్యయం కానుంది.
Advertisement
Advertisement