రాయలసీమకు శాపంగా మారిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముప్పేట పోరుకు సన్నద్ధం కావాలని వివిధ పార్టీలు, సంఘాల నేతలు నిర్ణయించారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాయలసీమకు శాపంగా మారిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముప్పేట పోరుకు సన్నద్ధం కావాలని వివిధ పార్టీలు, సంఘాల నేతలు నిర్ణయించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య అధ్యక్షతన ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ఈశ్వరయ్య ప్రకటించారు. ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాయలసీమతోపాటు మహబూబ్‌నగర్, ప్రకాశం, నెల్లూరు, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఈ విషయాలను రాష్ర్టపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు జాతీయ పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఈ నెల 9 లేదా 10వ తేది గండికోట జలాశయం వద్ద ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయ పోరాటాన్ని చేపట్టాలని నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించాలని, ఇందులో భాగంగా పోలవరం, దమ్ముగూడెం-సాగర్ టైల్‌పాండ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ క్యారీ ఓవర్ కింద కేటాయించిన నీటిని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు కేటాయించాలన్నారు.
ఈ సమావేశంలో టీడీపీ నేత గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ అల్మట్టి ఎత్తు పెంచడం వల్ల తెలుగుగంగ ప్రాజెక్టుకు కూడా నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. దళిత ప్రజాపార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్ మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా, అశాస్త్రీయంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుడు నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ మిగులు జలాలు కూడా మూడు రాష్ట్రాలకు పంచడం అన్యాయమన్నారు.
ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.లింగమూర్తి , జిల్లా రైతు సేవా సమితి అధ్యక్షుడు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, కార్యదర్శి ఎంవీ సుబ్బారెడ్డి, పాత కడప నీటి సంఘం అధ్యక్షుడు దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఏపీ బీసీ మహాసభ రాష్ట్ర కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల ఫోరం నాయకులు జేవీ రమణ, టీడీపీ నాయకుడు బాలకృష్ణయాదవ్, సీపీఐ నగర కార్యదర్శి జి.చంద్ర, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనలే శరణ్యం...
సాంకేతిక కారణాలతో ట్రిబ్యునల్ తీర్పు ఆగిపోయే పరిస్థితి లేదు. దీనిని ఆపాలంటే ప్రజా ఆందోళనలే శరణ్యం. ట్రిబ్యునల్‌కు కర్ణాటక కరువే కనిపించిందిగానీ రాయలసీమ కరువు కనబడకపోవడం దురదృష్టకరం. నాయకులు ఓట్లు, సీట్లు తప్ప నీళ్ల గురించి పట్టించుకోవడం లేదు.
- ఎన్.రవిశంకర్‌రెడ్డి, సీపీఎం నాయకుడు
ట్రిబ్యునల్ తీర్పు శాపం..
ట్రిబ్యునల్ తీర్పు రాయలసీమ పాలిట శాపం. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ నీరు కేటాయిస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ‘సీమ’ రైతాంగానికి తీవ్ర నిరాశ మిగిలింది. భవిష్యత్తులో తాగునీటికి సైతం వలసలు తప్పేలా లేవు. ఈ ప్రాంతానికి చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, వైఎ స్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అన్యాయంపై నోరు విప్పాలి.
- సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ
కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు
నిక రజలాలు కేటాయించాలి..
రాయల సీమ ప్రాజెక్టులకు 200 టీఎంసీల నికర జలాలు కేటాయించాలి. పోలవరం, దుమ్ముగూడెం-టెయిల్‌ఫాండ్ ప్రాజెక్టుల్లో తొలి ప్రాధాన్యత రాయలసీమకే ఇవ్వాలి.
- రమేష్‌నాయుడు,
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి
ప్రాజెక్టులకు నీరివ్వాలి..
ఇంతకాలం ఆంధ్ర రాష్ట్రం ఉపయోగించుకున్న 285 టీఎంసీల మిగులు జలాలను సైతం ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకు పంపిణీ చేయడం వల్ల మనకు అన్యాయం జరిగింది. జూరాల, ఆర్‌డీఎస్‌లకు మినహా తెలుగుగంగకు కూడా నికర జలాలు ఇవ్వలేదు. కేటాయించిన నీటిని క్యారీ ఓవర్ కింద ఉంచడం తీవ్ర అభ్యంతరకరం. క్యారీ ఓవర్ కింద కేటాయించిన నీటిని సీమ ప్రాజెక్టులకు ఇవ్వాలి. - ఎం.వెంకట శివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ