డామిట్.. కథ అడ్డం తిరిగింది | Damit .. shifts to the story | Sakshi
Sakshi News home page

డామిట్.. కథ అడ్డం తిరిగింది

Published Tue, Jul 1 2014 4:20 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

డామిట్.. కథ అడ్డం తిరిగింది - Sakshi

డామిట్.. కథ అడ్డం తిరిగింది

 సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ నేతలు ఆశలు అడియాసలు కానున్నాయా.. తాయిలాలు..ప్రలోభాలు, విఫలం కానున్నాయా.. అనే ప్రశ్నలకు  అవుననే సమాధానం  వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల్లో అణువంతైనా చలనం లేకపోవడంతో తెలుగుతమ్ముళ్లకు శృంగభంగం తప్పేటట్లు లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
 
అధికార పార్టీ వైపు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు చూస్తున్నారు... జెడ్పీ పీఠం మాదే..అదేబాటలో కడప నగర కార్పొరేటర్లు ఉన్నారు.. చిటికేస్తే మేయర్ పదవి దక్కుతుంది.. అంటూ ఇంతకాలం ఊదరగొట్టిన తెలుగుతమ్ముళ్లు డైలమాలో పడ్డారు. ఆత్మవిశ్వాసం ముందు అధికార దర్పం పనిచేయడం లేదు. టీడీపీ అనైతిక పద్ధతులు బెడిసికొడుతున్నాయి. ప్రజాతీర్పుకు భిన్నంగా అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని జెడ్పీ చైర్మన్‌గిరీని సొంతం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుటిలనీతిని ప్రదర్శించింది.

అందుకు ఎంపీ రమేష్, కడప పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసులరెడ్డి పాత్రదారులుగా తెరపైకొచ్చారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మైండ్‌గేమ్‌కు పదును పెట్టారు. ఏకంగా 15 మంది వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు టీడీపీ వైపు చూస్తున్నారంటూ గాలికబుర్లకు తెర లేపారు. కేవలం 11మంది జెడ్పీటీసీల బలం ఉన్న టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేశారు. ఇవేవీ పనిచేయక పోవడంతో ఉన్న మర్యాద కాస్త పోయిందనే ఆవేదనలో ఆపార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.
 
కార్పొరేషన్‌పై వదులుకున్న ఆశలు....

వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల విశ్వాసం ముందు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు నీరుగారాయి. కడప కార్పొరేషన్‌ను కైవ సం చేసుకుంటామని బీరాలు పలికిన టీడీపీ నేత సీఎం రమేష్‌కు దిక్కతోచని పరిస్థితి తలెత్తింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కార్పొరేటర్ల మనస్సును మార్చలేకపోయారు. కేవలం 8 మంది కార్పొరేటర్ల బలం మాత్రమే ఉండగా నగర మేయర్ పదవిని ఆశించడమే తప్పుగా ఆ  పార్టీ నేతలు భావిస్తున్నారు.

సంఖ్యా బలమున్నా టీడీపీ, నగర మేయర్ పదవి ఆశించడమే అసలు తప్పుగా ప్రస్తుతం ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుపై ప్రయోగించిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక లాభం లేదని భావించి ఆశలు వదులుకున్నట్లు సమాచారం. తెలుగుదేశం చట్రంలో చిక్కుకుపోయిన 8 మంది ఎర్రగుంట్లకు చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు  ప్రస్తుతం డోలాయమానంలో పడ్డట్లు సమాచారం. విప్ ధిక్కరిస్తే పదవి కోల్పోతామనే భయం వారిని వెంటాడుతోంది.
 
సంకెళ్ల నుంచి విముక్తి కల్గితే వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలువనున్నట్లు సమాచారం. ఈ విషయమై బంధువుల వద్ద మదనపడుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే ఓటు వేస్తామంటూ టీడీపీ నిర్బంధంలో ఉన్న ముగ్గురు కౌన్సిలర్లు బంధువులకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.

కొండను తవ్వినట్లుగా జెడ్పీ వ్యవహారం....
తెలుగుదేశం పార్టీ కేవలం 11మంది జెడ్పీటీసీలకు గెల్చుకుంది. 39 మంది జెడ్పీటీసీలున్న వైఎస్సార్‌సీపీకి కాదని జెడ్పీ పీఠం తమదేనని టీడీపీ నేతలు ప్రకటించుకున్నారు. ప్రలోభాలకు లొంగుతారని ఆపార్టీ నేతలు జెడ్పీటీసీలకు వల పన్నారు. పెద్ద ఎత్తున మంతనాలు, వ్యూహాలు రచించారు. చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ముగ్గురి మద్దతు కూడగట్టినట్లు సమాచారం.

వారు కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే పదవి కోల్పోవలసి వస్తుందనే భయంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీంతో తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాసలు కాకతప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాయి. ఇప్పటికే ముప్పై మంది వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు ఒకే వేదికకు చేరినట్లు తెలుస్తోంది. మిగిలిన వారు నేడో, రేపో వారితో కలువనున్నారు. పార్టీ ప్రతిష్టను మంటకలుపుతున్న నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయాలని టీడీపీ సీనియర్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టను మంటగలిపే చర్యలపై వారు మదనపడుతున్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement