కారణమేదైతేనేం ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
కామారెడ్డి, న్యూస్‌లైన్ : కారణమేదైతేనేం ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినవాళ్లే హత్యలకు తెగబడుతున్నారు. క్షణికావేశం లో బంధువులనే హతమారుస్తున్నారు. కుటుం బ కలహాలు, ఆస్తి తగాదాలు, అనుమానాలు, ఆర్థిక సమస్యలు.. ఇలా పలు సమస్యలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. జిల్లాలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పలు హత్య కేసుల్లో రక్తసంబంధీకులే హంతకులనే విషయం పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. జిల్లాలో వరుసగా ఇలాంటి హత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ తగాదాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఒకవైపు, హత్యలు మరోవైపు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కుటుంబ కలహాలు
కొన్ని కుటుంబాల్లో తలెత్తుతున్న కలహాలు ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తున్నాయి. చిన్నచిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ పెద్దవిగా చేసుకుంటున్నారు. దీంతో కలహాలు పెరిగి ఆవేశాలకులోనై హత్యలకు పాల్పడుతున్నారు. కొందరు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అనుమానాలతో హత్యలు
జీవిత భాగస్వామిపై అనుమానాలు పెంచుకుని కొందరు వేదింపులకు పాల్పడుతున్నారు. భార్యను భర్త, భర్తను భార్య అనుమానించిన సంఘటనలు గొడవలకు కారణమవుతున్నాయి. అవి హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లకు ఇతరుల నుంచి లెక్కకు మించి ఫోన్‌కాల్‌స వచ్చిన సందర్భాల్లో అనుమానాలు పెంచుకుంటున్నారు. ఇది పెను భూతంగా మారి హత్యలకు దారితీస్తోంది. ఏ సమస్యకైనా పరిష్కార మార్గం ఉంటుందని, చిన్నచిన్న సంఘటనలను భూతద్దంలో చూడకుండా వాటి పరిష్కారానికి ప్రయత్నించాలని మానసిక వైద్యులు, న్యాయవాదులు, పోలీసులు సూచిస్తున్నారు.
అనుమానం పెనుభూతం
క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులపై అనుమానాలు, వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. మత్తుపదార్థాలు స్వీకరించడమూ అనర్థాలకు మూలమవుతోంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంతటి సమస్యకైనా పరిష్కార మార్గం ఉంటుంది. కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం దొరుకుతుంది.
-కేశవులు, మానసిక వైద్యనిపుణుడు, ఇందూరు
నమ్మకం పెరగాలి
కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే వీటిని అర్థం చేసుకొని పరిష్కార మార్గాలు కనుగొనాల్సింది పోయి కొట్లాటలకు దిగుతున్నారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్లను గౌరవించాలన్న భావన పెరగాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరగాలి. భార్యపై భర్తకు, భర్తపై భార్యకు నమ్మకం ఉండాలి. తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏ సమస్యా ఉండదు.-సురేందర్‌రెడ్డి, డీఎస్పీ, కామారెడ్డి
విలువలు సన్నగిల్లడం వల్లే...
మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. దీంతో సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. తండ్రి అంటే పిల్లలకు, భర్త అంటే భార్యకు, భార్య అంటే భర్తకు గౌరవం లే ని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కలహాలు పెరిగి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినపుడు పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి.
-క్యాతం సిద్ధరాములు, న్యాయవాది, కామారెడ్డి