సోదరుడిగా సూచనలు చేస్తా!
- తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలి: గవర్నర్ నరసింహన్
- సీనియర్ బ్రదర్‌గా రెండు రాష్ట్రాల శ్రేయస్సుకు కృషి చేస్తా
- కొత్త ఏడాది రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ‘2015 మనందరికీ మంచి ఏడాది కావాలి... తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుతున్నా. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు సంతోషంగా ఉంటారనే నమ్మకం ఉంది’ అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. సీనియర్ బ్రదర్‌గా, గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్‌గా రెండు రాష్ట్రాల శ్రేయస్సుకు కృషి చేస్తానని, సూచనలు చేస్తానని ఆయన చెప్పారు. నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ గురువారం రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రముఖులతో పాటు వందలాది మంది సామాన్య ప్రజలు గవర్నర్‌ను కలసి నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాల సీఎంలతో తరచూ సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని, వివాద రహిత తెలుగు రాష్ట్రాలే తన కల అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులిద్దరూ మంచి విజన్‌తో పనిచేస్తున్నారని, కొత్త ఏడాదిలో వారి ప్రణాళికలకు ఫలి తాలు అందుతాయని ఆశిస్తున్నానన్నారు.
ఎంసెట్ పరీక్ష విషయంలో రెండు రాష్ట్రాల విద్యా మంత్రులతో సమావేశమైనప్పుడు కొన్ని మార్గాలు సూచించానని, వాటిని పరిగణనలోకి తీసుకొని ఆలోచిస్తామని వారి వురూ అంగీకరించారని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా తనకు ఎలాంటి నివేదిక అందలేదని, దాని కోసమే వేచిచూస్తున్నానని చెప్పారు. వర్సిటీల వీసీల నియామకాలపై వివాదాలు త్వరలోనే సద్దుమణిగేలా చొరవ తీసుకుంటానన్నారు. పోలవరం ముంపు మండలాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించే విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు.
సమాజంపై మీడియా అమిత ప్రభావం చూపుతుందని, పాత్రికేయులు వక్రీకరణలు మాని నిర్మాణాత్మక సూచనలు చేయాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. గవర్నర్‌ను కలసిన వారిలో ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపీ రాముడు, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులున్నారు.
రెండు రాష్ట్రాల వేడుకల్లో పాల్గొంటా..
జనవరి 26న రెండు రాష్ట్రాల గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొంటానని గవర్నర్ వెల్లడించారు. 26న ఉదయం విజయవాడలో జరిగే ఏపీ ఉత్సవాలకు హాజరవుతానన్నారు. అనంతరం నేరుగా వాయు మార్గంలో హైదరాబాద్ చేరుకుని తెలంగాణ గణతంత్ర వేడుకల్లో పాల్గొననున్నట్టు వివరించారు. 26న సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలకు విందు ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.