అర్ధరాత్రి హైడ్రామా!!
► బీఆర్‌పీ రోడ్డులో ఆక్రమణల తొలగింపు
► బ్రాహ్మణవీధిలో అన్నపూర్ణాదేవి ఆలయం.. భారీగా పోలీసులు,
► నగరపాలకసంస్థ సిబ్బంది మోహరింపు
విజయవాడ (వన్‌టౌన్): వన్‌టౌన్‌లోని బాబారాజేంద్రప్రసాద్ రోడ్డులో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. భారీగా పోలీసులు, నగరపాలకసంస్థ, పోలీసు సిబ్బంది భారీగా మోహరించి స్థానికుల్లో కలవరం పుట్టించారు. అప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించారు. అర్ధరాత్రి పదకొండు గంటలకు ప్రారంభమైన ఈ తంతు రెండున్నర గంటల వరకూ కొనసాగింది. నెహ్రూరోడ్డు విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందు పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు.
పంజా సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వెస్ట్‌బుకింగ్ వరకూ ఉన్న దుకాణాల ఎదుట ఆక్రమణలను తొలగించాలని శనివారం సాయంత్రం అధికారులు ఆయా యజమానులకు సూచించారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా నగరపాలకసంస్థ సిబ్బంది అక్కడకు చేరుకొని ‘ఇంకా తొలగించలేదేమిటంటూ’ ప్రశ్నించడంతో యజమానులు ఒక్కసారిగా బిత్తరపోయారు. రెండుమూడు గంటల క్రితమే కదా చెప్పింది అప్పుడే ఏమిటని యజమానులు తిరిగి ప్రశ్నించారు.
కమిషనర్ ఆధ్వర్యంలోనే తొలగింపు
మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ ఆధ్వర్యంలోనే ఆక్రమణలను తొలగించారు. నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్, సిటీప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ఈఈలు, వెస్ట్ ఏసీపీ రామకృష్ణ, సీఐ దుర్గారావు ఇతర ఎస్‌ఐల సమక్షంలో ఈ తంతు నిర్వహించారు. బుల్డోజర్లు ఇతర వాహనాలతో దుకాణాల ఎదుట ఉన్న ఆక్రమణలను తొలగించారు. వెల్డర్లతో బోర్డులను, ఇతర సామాగ్రిని తొలగించారు. ముసాఫిర్‌ఖానా సెంటర్‌లో రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. దర్గా చుట్టూ ఉన్న దుకాణాలను తొలగించి కేవలం దర్గా ప్రాంగణాన్ని మాత్రమే ఉంచారు. కొంతమంది అభ్యంతరాలను వ్యక్తం చేసినా వాటిని పూర్తిగా పక్కన పెట్టి అధికారులు వారి పని వారు చేసుకుపోయారు.
తొలగింపుపై ఆసీఫ్ అభ్యంతరం
పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో అర్ధాంతరంగా తొలగింపు చేపట్టడం సరికాదని స్థానిక కార్పొరేటర్ షేక్ ఆసీఫ్ అధికారులకు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు తమ షాప్‌ల ఎదుట ఉన్న సామాగ్రిని తామే తొలగించుకుంటామని, ఒకపూట సమయాన్ని ఇవ్వాలని పలువురు స్థానిక కార్పొరేటర్ ఆసీఫ్‌కు విజ్ఞప్తి చేయటంతో ఆయన దానిని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దానిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి ఆదివారం సాయంత్రం లోపు తొలగించుకోవాలని సూచించారు. రాత్రి పనులు పూర్తయ్యే వరకూ కమిషనర్‌తోనే ఉన్నారు. తొలగింపు చర్యలను స్థాయీ సంఘం మాజీ అధ్యక్షులు దాడి అప్పారావు ఖండించారు.
బ్రాహ్మణవీధిలో అన్నపూర్ణాదేవి ఆలయం తొలగింపు
బ్రాహ్మణవీధిలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ఆనుకొని ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయాన్ని అర్ధరాత్రి వేళ నగరపాలకసంస్థ సిబ్బంది తొలగించారు. నాలుగైదు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా దసరాలో భారీగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.