గూడూరు టౌన్: ఓ యువకుడిని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన గాంధీనగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిల్లకూరు మండలం వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన గుంజి సీతమ్మకు ముగ్గురు కుమారులున్నారు. కొన్నేళ్ల కిందట వీరు గూడూరు వలస వచ్చి గాంధీనగర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. సీతమ్మ మూడో కుమారుడైన గుంజి ధనుంజయ అలియాస్ ధర్మారావు(28) భార్యా, పిల్లలతో కలిసి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
ఇటీవలే వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన కొందరితో కలిసి కేరళ రాష్ట్రంలో కాంక్రీట్ పనులు చేసేందుకు ధర్మారావు వెళ్ళారు. కొన్ని రోజులు పనిచేసిన తర్వాత కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో గూడూరుకు తిరిగొచ్చాడు. అప్పటి నుంచి టైఫాయిడ్‌తో బాధపడుతూ 20 రోజులకు పైగా ఇంట్లోనే ఉంటున్నాడు. శనివారం రాత్రి ధర్మారావు ఇంటికి నలుగురు వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళారని స్థానికులు చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ధర్మారావు కొందరితో కలిసి గాంధీనగర్ ప్రాంతంలో మద్యం తాగారని తెలిపారు. తెల్లారేసరికే ధర్మారావు ఇంటికి వంద మీటర్ల దూరంలో శవమై కనిపించాడు.
తల పై తీవ్రంగా గాయపరచి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. తెల్లవారుజామున మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ధర్మారావు మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య అంకమ్మతో పాటు అశోక్, ఆదిశంకర్ అనే కుమారులున్నారు. ధర్మారావు హత్యకు వివాహేతర సంబంధాలే కారణమమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ధర్మారావుతో కలిసి మద్యం తాగిన వారే ఈ హత్య చేసి ఉంటారని అనుకుంటున్నారు. పట్టణ సీఐ భూషణం, రెండో పట్టణ ఎస్సైలు నారాయణరెడ్డి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. నెల్లూరు నుంచి వచ్చిన పోలీసు జాగిలం ఆ ప్రాంతంలోని వీధుల్లో తిరుగుతూ మద్యం దుకాణంలోని వాటర్‌ట్యాంకు వరకు వచ్చింది. క్లూస్‌టీం కూడా వేలిముద్రలను సేకరించింది.
యువకుడి గొంతుకోసి దారుణ హత్య
Published Mon, Oct 27 2014 12:39 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement