పాఠశాలల భవనాలు పేకమేడల్లా మారుతున్నాయి. పగుళ్లు తేలిన గోడలు.. పెచ్చులూడుతున్న స్లాబులు.. ఎప్పుడు పడిపోతాయో తెలియని భవనాలు.. వెరసి విద్యార్థులు భయాందోళనల మధ్య విద్యాభ్యాసం సాగిస్తున్నారు. బేల మండలంలో సుమారుగా శిథిల భవనాల్లోనే చదువులు సాగించాల్సిన దుస్థితి.
బేల, న్యూస్‌లైన్ : పాఠశాలల భవనాలు పేకమేడల్లా మారుతున్నాయి. పగుళ్లు తేలిన గోడలు.. పెచ్చులూడుతున్న స్లాబులు.. ఎప్పుడు పడిపోతాయో తెలియని భవనాలు.. వెరసి విద్యార్థులు భయాందోళనల మధ్య విద్యాభ్యాసం సాగిస్తున్నారు. బేల మండలంలో సుమారుగా శిథిల భవనాల్లోనే చదువులు సాగించాల్సిన దుస్థితి. గత బుధవారం తెల్లవారుజామున బేల మండలకేంద్రంలోని తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాల భవనం కూలడంతో విద్యార్థులు, పోషకులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. బేల మండలంలో గిరిజన సంక్షేమ ప్రాథమిక 33, మండల పరిషత్ ప్రాథమిక 35, మండల పరిషత్ ప్రాథమికోన్నత 11, జిల్లా పరిషత్ ఉన్నత 5 పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటే ఓ మినీ గురుకులం, ఒక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు, 3 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఏడాది 5 వేల పైబడి విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చదువుతున్నారు. కాగా ఆయా పాఠశాల నుంచి భవనాల పరిస్థితి, మౌలిక సౌకర్యాలు, ఇతరత్రా వివరాలు ప్రతి విద్యా సంవత్సరం సెప్టెంబర్‌లో డైస్ (జిల్లా పాఠశాల విద్యా సమచారం) ఫారాల్లో విద్యాశాఖ తీసుకుంటోంది.
ఈ సమచారాన్ని ఎప్పుడూ పట్టించుకున్న దాఖలలు లేవని, ఈ ఫారాలన్నింటినీ మూలన పడవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్పీలు, సీఆర్పీల ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నా ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విద్యాశాఖలో భాగమైనా రాజీవ్ విద్యామిషన్ ఇంజినీర్లతో పాఠశాల భవనాల పరిస్థితిపై సమాచారం తెప్పించుకుంటూ, ఆవశ్యకమైన చోట కాకుండా అవసరం లేని చోట భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. దీనికి నిదర్శనం బేల మండలంలోని మశాల(కె) గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. ఇక్కడ విద్యార్థుల సంఖ్య అధికంగా లేకున్నా, 3వ భవన నిర్మాణం కొనసాగుతోంది. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చి, ఈ చోట నూతన భవనాల నిర్మాణాలపై ఏమాత్రం ఇప్పటిదాకా దృష్టి సారించడం లేదు. కాగా బేల మండలంలో మశాల(బి), డోప్టాల, సదల్‌పూర్, సోన్‌కాస్, చప్రాలలో ప్రాథమిక, మారోతిగూడ, రంఖం, కొబ్బాయి, దహెగాం, దుబ్బగూడ(ఎం), గణేష్‌పూర్, తదితర గ్రామాల్లోని పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ భవనాలు కూలి, ప్రమాదాలు జరిగితే గానీ ఏమాత్రం స్పందించడం లేదని పోషకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి, ఆవశ్యకమైన చోట నూతన భవనాలను నిర్మించాలని పోషకులు డిమాండ్ చేస్తున్నారు.
కూలేటట్లున్నయ్..
మా బడిలో ఓ పాత బిల్డింగు ఉంది. ఈ బిల్డింగు కూలేటట్లు ఉంది. ఇప్పుడు కురుస్తున్న వానలకు గోడలన్నీ తడిసినయ్. అంతకుముందు గోడలకు బీటలు పడ్డయి. మొన్న బేలలో బిల్డింగు కూలుడుకు మా బిల్డింగు కూలుతదేమోనని భయమనిపిస్తంది.
- అఫ్రోజ్, విద్యార్థి, డోప్టాల
నిర్లక్ష్యమే..
పాఠశాల భవనాల దు స్థితిపై విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. భవనం కూ లుతదని ఏడాదిగా చెప్పుతున్నా పట్టించుకుంటలేరు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. బేల కు కొత్త భవనాలు మంజూరు చేయాలి.
- పొతరాజ్ కిష్టన్న,
ఎస్‌ఎంసీ అధ్యక్షుడు, బేల
పాత వాటిని కూల్చాలి..
విద్యాశాఖ అధికారులు శిథిలావస్థతలో ఉన్న భవనాలను గుర్తించి.. వాటిని కూల్చివేయిం చాలి. అప్పుడే ప్రమా దం జరగకుండా ఉం టుంది. బేలలో పిల్లలు లేనప్పుడు కూలడంతో ప్రమాదం తప్పింది. మా గ్రామంలోని పాఠశాల భవనం కూడా ప్రమాదకరంగా ఉంది.
- శ్రీపాద విజయ్, పోషకుడు డోప్టాల