- నాడు అటవీ మార్గం.. నేడు ఆకాశయానం
- వేల నుంచి కోట్లలోకి చేరిన భక్తుల సంఖ్య
సాక్షి, హన్మకొండ : దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే మేడారం జాతరకు ప్రారంభంలో భక్తులు కాలిబాట ద్వారా చేరుకునేవారు. ఆ తర్వాత ఎడ్లబండ్ల మార్గం గుండా వెళ్లేవారు. జాతర చుట్టుపక్కల అటవీ గ్రామాలైన కాల్వపల్లి, ఊరట్టం, కొత్తనాగారం, కరీంనగర్, లింగాల, పస్రా మీదుగా మొత్తం 72 మార్గాల గుండా మేడారం చేరుకునే వారు.
కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే భక్తులు పగిడిపల్లి, బొర్లగూడెం, సింగారం మీదుగా వరంగల్ జిల్లాలోని కాల్వపల్లి చేరుకుని జాతరకు వచ్చేవారు. ఇప్పటికీ ఈ మార్గాలు ఉపయోగంలో ఉన్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి కుటుంబ సభ్యులతో వచ్చే భక్తులు ఏటూరునాగరం వద్ద గోదావరి దాటేవారు. ఉదయాన్నే తుపాకులగూడెం వద్ద ఎడ్లబండ్లను కిరాయికి మాట్లాడుకుని కొత్తూరు, సర్వాయి గ్రామాల మీదుగా సాయంత్రానికల్లా అటవీ గ్రామం అయిన ఐలాపురం చేరుకుని... అక్కడే రాత్రి బస చేసేవారు.
మరునాడు బయల్దేరి ఊరట్టం చేరుకుని సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించేవారు. ఇప్పటికీ ఊరట్టం గ్రామ సమీపంలో ప్రతి జాతరకూ వందల సంఖ్యలో ఎడ్లబండ్లు అందుబాటులో ఉంటాయి. వరంగల్ మీదుగా వచ్చే భ క్తులు ములుగు గట్టమ్మ దగ్గర రాత్రి బస చేసేవారు. అక్కడి నుంచి బయల్దేరి చల్వాయి, సోమలగడ్డ రంగాపురం, ఇప్పలగడ్డ, కొత్తనాగారం మీదుగా ప్రాజెక్టునగర్ చేరుకుని మేడారం వస్తారు. ఖమ్మం జిల్లా గుండాల మీదుగా జిల్లాలోకి కొత్తగూడ మండ లాలకు చెందిన భక్తులు లింగాల చేరుకుని అక్కడి నుంచి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు.
1966 నుంచి ఆర్టీసీ..
గోవిందరావుపేట-చల్వాయి మధ్య దయ్యాలవాగుపై వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ 1966 నుంచి బస్సులను మేడారం జాతరకు నడిపిస్తోంది. మొదటిసారి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని ముఖ్యమైన పట్టణాల నుంచి 110 బస్సులను నడిపించింది. భక్తుల రద్దీ దృష్ట్యా 1980 తర్వాత బస్సుల సంఖ్య క్రమేపీ పెరిగింది. ముఖ్యంగా తాడ్వాయి నుంచి మేడారం వరకు బీటీ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల సంఖ్య యేటేటా పెరుగుతోంది. 1996లో జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుం చి భక్తుల సంఖ్య పెరిగింది. గత జాతరలో ఆర్టీసీ రా ష్ట్రంలోని నలుమూలల నుంచి 3వేల బస్సులను నడిపించింది. ఈ జాతరలో బస్సుల సంఖ్య 3,525కి పెంచింది.
పెరిగిన ప్రైవేట్ వాహనాలు
జంపన్నవాగుపై 2002లో బ్రిడ్జి నిర్మాణం తర్వాత ప్రైవేటు వాహనాల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. దీంతో మేడారం వచ్చేందుకు ఎడ్లబండ్లు, ఆర్టీసీ బస్సులకు ప్రత్యామ్నాయంగా పస్రా-నార్లాపూర్-మేడారం మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రతీ జాతరలో వేల సంఖ్యలో ఆటోలు, కార్లు, సుమోలు, జీపులలో మేడారానికి భక్తులు వస్తున్నారు. ఈసారి మేడారం వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 23 స్థలాలను ఎంపిక చేశారు. అందులో 15 పార్కింగ్ స్థలాలు నార్లాపూర్-జంపన్నవాగు మధ్యలో ఉండటం ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రైవేటు వాహనాల రద్దీకి అద్దంపడుతోంది.
గాల్లోనూ ఎగరొచ్చు
రాష్ట్ర పండుగగా గుర్తింపు, రోడ్డు మార్గాలు మెరుగుపడడంతో భక్తుల రాక పెరిగింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆకాశమార్గాన పయనించి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చింది. 2010 జాతర సందర్భంగా మొదటిసారిగా వరంగల్ నుంచి మేడారం వరకు హెలికాప్టర్ సేవలను టర్బో ఏవియేషన్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. రానుపోను చార్జి రూ.6వేలతో మామునూరు ఎయిరోడ్రం నుంచి పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వర కు భక్తులను చేర్చారు. గత జాతరలో ఈ సౌకర్యం అందుబాటులో లేదు. కాగా, 2014 ఫిబ్రవరి 12 నుంచి జరిగే జాతరను పురస్కరించుకుని రెండోసారి ములుగు, వరంగల్, హైదరాబాద్ నుంచి జాతర ప్రాంగణం వరకు హెలికాప్టర్ సేవలను టర్బో ఏవియేషన్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.