బస్సులో ప్రయూణికుడి హఠాన్మరణం
Published Sun, Sep 22 2013 3:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ఖమ్మం నుంచి హన్మకొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సులో కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడుకు చెందిన బి.వీర్రాజు అనే వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. హన్మకొండ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీర్రాజు శనివారం ఖమ్మంలో హన్మకొండ వెళ్లే బస్సు ఎక్కాడు. బస్సు హన్మకొండను సమీపిస్తుండగా గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన పక్క సీట్లలోని ప్రయాణికులు కండక్టర్‌కు చెప్పడంతో బస్సు హన్మకొండ బస్టాండ్‌కు చేరుకోగానే సిబ్బంది స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై తమ సిబ్బందితో చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అతడి సెల్‌ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మృతుడు వీర్రాజు మధుమేహం, బీపీ, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. వీర్రాజు గతంలో హన్మకొండలో పనిచేశాడని, ఆ పనులకు సంబంధించి డబ్బులు రావాల్సి ఉందని తెలిసిందని సీఐ చెప్పారు. డబ్బులు ఇప్పించాలని కాజీపేట ఏఎస్పీ కోయ ప్రవీణ్‌ను కోరేందుకు హన్మకొండకు వచ్చాడని, మృతుడి సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్లు పరిశీలించగా అందులో ఏఎస్పీ నంబర్ ఉన్నట్లు చెప్పారు. మృతుడు ఏఎస్పీతో మాట్లాడినట్లు ఫోన్‌లో నమోదై ఉండడంతో ఆయనకు పోలీసులు సమాచారం అందించారు. ఆయన హన్మకొండ బస్‌స్టేషన్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
Advertisement
Advertisement