రాజమహేంద్రవరంలో బస్సు ఎక్కడానికి ప్రయాణికుల పాట్లు
తూర్పుగోదావరి,మండపేట: చంద్రబాబు ప్రచార ఆర్భాటం ప్రయాణికులకు సంకటంగా మారుతోంది. ‘పసుపు కుంకుమ’ –2 పేరిట విశాఖపట్నంలో నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా బస్సులను తరలించడం జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 203, మెప్మా ఆధ్వర్యంలో 20 బస్సులను తరలించారు. ఉసూరుమంటూ కొందరు అర్ధాంతరంగా ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనుతిరగ్గా, తప్పనిసరి పరిస్థితుల్లో మిగిలిన వారు ఆపసోపాలు పడుతూ ప్రయాణాలు సాగించాల్సి వచ్చింది.
గద్దెనెక్కాక బేషరతుగా డ్వాక్రా రుణాల మాఫీ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ మహిళలకు గాలం వేసే పనిలో పడ్డారు. ‘పసుపు కుంకుమ –2’ పేరిట మరో దగాకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం వేదికగా శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు జిల్లాలోని రాజోలు డిపో మినహా మిగిలిన ఎనిమిది డిపోల నుంచి 223 బస్సులను తరలించారు. వీటిలో రాజమహేంద్రవరం డిపో నుంచి 35 బస్సులను, కాకినాడ నుంచి 34 బస్సులు, అమలాపురం నుంచి 23, గోకవరం నుంచి 25, రావులపాలెం నుంచి 17, ఏలేశ్వరం నుంచి 18, రామచంద్రపరం నుంచి 26, తుని నుంచి 25 బస్సులను డీఆర్‌డీఏ ఏర్పాటు చేయగా మెప్మా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, ఏలేశ్వరం డిపోల నుంచి రెండు బస్సులు చొప్పున అమలాపురం, కాకినాడ డిపోల నుంచి నాలుగు చొప్పున, తుని నుంచి ఎనిమిది బస్సులను ఏర్పాటు చేశారు. ఆయా బస్సుల ద్వారా అధికార పార్టీ నేతలు దాదాపు పది వేల మంది వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలను ప్రాంతీయ సదస్సుకు తరలించినట్టు అంచనా.
ప్రయాణికుల అవస్థలు
పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, ఇంద్ర, అమరావతి, గరుడ కేటగిరీల్లో జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో ఆర్టీసీ, అద్దె ప్రాతిపదిక (హైయిర్) బస్సులు 875 వరకూ ఉన్నాయి. వీటిలో అధికశాతం ‘పల్లె వెలుగు’ బస్సులు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు మినహాయించి స్థానికంగా తిప్పే ‘పల్లె వెలుగు’ బస్సులను విశాఖ సదస్సుకు తరలించారు. కొన్ని రూట్లలో పూర్తిగా ‘పల్లె వెలుగు’ బస్సులను నిలిపివేయగా రద్దీ రూట్లలో ఒకటి రెండు మాత్రమే సర్వీసులు నడిపారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం తదితర పనుల నిమిత్తం బస్టాండ్లకు వచ్చిన వారు బస్సులు లేవని తెలిసి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఇదే అదనుగా కొన్నిచోట్ల ఆటో చార్జీలను అమాంతం పెంచేశారు. సాధారణ టిక్కెట్టు ధరకు రెండు నుంచి మూడు రెట్లు వరకు అధికంగా వసూలు చేయడంతో చేతి చమురు వదిలిందని ప్రయాణికులు వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ప్రయాణం విరమించుకోగా, మరికొందరు కిక్కిరిసిన బస్సుల్లో అవస్థలతో ప్రయాణం సాగించారు. ప్రచార ఆర్భాటం కోసం ప్రయాణికులను ఇబ్బందులు పాలు చేయడమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment