
మళ్లీ గుబులు
సాక్షి, కడప: గ్యాస్ వినియోగదారుల్లో గుబులు రేగుతోంది. మళ్లీ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం.
సాక్షి, కడప: గ్యాస్ వినియోగదారుల్లో గుబులు రేగుతోంది. మళ్లీ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. పేద ప్రజల సంక్షేమం కోసం అంటూ అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన నగదు బదిలీ పథకం విజయవంతం కాలేదు. సామాన్య జనానికి ఇబ్బందులు సృష్టించిందే గానీ ప్రయోజనం ఒనగూర్చలేదు.
చాలామందికి బ్యాంకుల్లో నగదు జమకాని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మళ్లీ నగదు బదిలీ పథకాన్ని తెరమీదికి తేవడంతో వినియోగదారులలో ఆందోళన మొదలైంది. త్వరలో జిల్లాలో కూడా నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమవుతోంది.
ఈ నెల 10 నుంచి అమలుకు శ్రీకారం
10వ తేదీనుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా జిల్లాల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించి బ్యాంకు ఖాతాలు లేనివారు వెంటనే తెరవాలని ఆదేశిస్తున్నారు. తొలి విడతలో 54 జిల్లాలో పథకం అమలు కానుండగా, జనవరి నుంచి మిగతా జిల్లాల్లో పెద్ద ఎత్తున నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.
నగదు బదిలీ పథకంలో భాగంగా ఒకేసారి గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో మొత్తం డబ్బులు కడుతున్నా... సాంకేతిక లోపంతోపాటు రెండు ఖాతాలు ఉన్న వారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వినియోగదారులకు నగదు బదిలీ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో కూడా పలు సమస్యలు ఎదురవుతున్నాయి.
రెండవ విడతలో జిల్లా
మొదటి విడత తర్వాత జనవరిలో నగదు బదిలీ పథకంలో వైఎస్సార్ జిల్లా చేరనుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆధార్ నమోదు, బ్యాంకుల ఖాతాలకు సంబంధించి అధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లాలో సుమారు 5.60 లక్షల పైచిలుకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా ఎవరైనా బ్యాంకుల్లో ఆధార్‌కార్డు సమర్పించని వారు ఉంటే వెంటనే అందించాలని అధికారులు కోరుతున్నారు.
ఏడాదవుతున్నా నగదు బదిలీ కాలేదు :
నా పేరు మాబున్నీసా... మాది రాయచోటి. 2013 డిసెంబరులో గ్యాస్ బుక్ చేసి రూ.1200 కట్టాను. ఇంతవరకు సబ్సిడీ సొమ్ము అకౌంట్‌లోకి రాలేదు. ఎందుకు రాలేదో ఎవరూ చెప్పరు. అదే నగదు బదిలీ కాకుండా అయి ఉంటే కేవలం రూ. 500కు గ్యాస్‌సిలిండర్ వచ్చేది. ఇప్పుడు కూడా అధికారులను అడిగితే ఏదో ఒక సాకు చెబుతున్నారే తప్ప డబ్బులు ఇప్పించే వారే లేరు.
రోజూ కూలీకి పోతున్నా..
ఇంకా సబ్సిడీ రాలేదు
నా పేరు సుబ్బమ్మ. మాది రాయచోటి. కూలీకి వెళితేగానీ పూట గడవదు. 2013 నవంబరు ప్రాంతంలో గ్యాస్ తీసుకున్నా ఎవరు వేస్తారో, ఎప్పుడు వేస్తారో తెలీదు. మేమేమో రూ. 1200 కట్టాము. రావాల్సిన సబ్సిడీ ఇంతవరకు రాలేదు. ఒకేసారి అంత డబ్బులు లేకపోవడంతో అప్పో సప్పో చేసి గ్యాస్ సిలిండర్‌కు చెల్లించినా ఇంతవరకు రాకపోతే ఎలా బతకాలి?