రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకోండి: బుట్టా
సాక్షి, న్యూఢిల్లీ: తుంగభద్ర నదిపై హవేరీ జిల్లాలో మరో రిజర్వాయర్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీ బుట్టా రేణుక కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే దిగువన ఉన్న కర్నూలు జిల్లా రైతాంగ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈమేరకు ఆమె ఉమాభారతికి శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించారు.
ఇప్పటికే ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచడంతో ఆగస్టు తర్వాత శ్రీశైలం డ్యాంకి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతోందని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనివల్ల కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఎగువ తుంగభద్రపై మరో డ్యాం నిర్మిస్తే జిల్లా రైతుల ఇబ్బందులు మరింత పెరుగుతాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించకుండా అడ్డుకోవాలని కోరారు.